రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్‌ల గురించి తెలుసుకుందాం.
ఐసీఎఫ్ కోచ్‌లు
భారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్‌తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్‌లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.
ఐసీఎఫ్ కోచ్‌లలో.. స్లీపర్ క్లాస్‌లో 72 బెర్త్‌లు, థర్డ్ ఏసీ క్లాస్‌లో 64 బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్‌ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.
ఐసీఎఫ్ కోచ్‌లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్‌లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
ఇక ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్‌లో 80 బెర్త్‌లను, థర్డ్ ఏసీ క్లాస్‌లో 72 బెర్త్‌లు ఉంటాయి. ఇవి ICF కోచ్‌ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్‌లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్‌లు చాలా అనుకూలంగా ఉంటాయి.
ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?


