
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా కనిపిస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, పాలసీపరంగా అనిశ్చితి, వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లడం తదితర అంశాల కారణంగా 2025 గ్లోబల్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి 2.8 శాతానికి కుదించింది. అయితే, ఇలాంటి అస్థిరత మధ్య కూడా భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక నియంత్రణకు కట్టుబడి ఉండటం, వృద్ధిని ప్రోత్సహించేలా ద్రవ్య విధానాలు ఉండటం వంటి అంశాలు దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటంలో కీలక పాత్ర పొషిస్తున్నాయి.
2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6.5% వృద్ధి సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. గ్రామీణ డిమాండ్ స్థిరంగా ఉండటం, పట్టణప్రాంతంలో వినియోగం మెరుగుపడటం, పెట్టుబడులు స్థిరంగా పుంజుకోవడం ఇందుకు దోహదపడనున్నాయి. మే 2025 నాటికి ద్రవ్యోల్బణం 2.8 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరి తర్వాత ఇది అత్యల్ప స్థాయి. ఆహారపదార్థాల ధరలు తగ్గడంతో పాటు సానుకూల రుతుపవనాల అంచనాలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ఇవన్నీ సానుకూలమే అయినప్పటికీ మార్కెట్లో అస్థిరత పెరుగుతుండటంలాంటి అంశాల కారణంగా డైవర్సిఫికేషన్‌కి ప్రాధాన్యమిచ్చే మల్టీ అసెట్ ఫండ్స్ ఆవశ్యకత కనిపిస్తోంది. ఎందుకంటే, 2024లో ఈక్విటీ మార్కెట్లో అన్ని విభాగాలు మెరుగ్గా రాణించడంతో డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ఒక స్థాయికే పరిమితమైనట్లు కనిపించింది. కానీ, మార్కెట్ అస్థిరత మళ్లీ పెరుగుతుండటం, వివిధ రంగాల మధ్య పనితీరులో అంతరాలు కనిపిస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో డైవర్సిఫికేషన్ వ్యూహాలకు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది.
ఈక్విటీలకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి రాబడులు అందించే సామర్థ్యం ఉండగా, హైబ్రిడ్ ఫండ్లు స్థిరంగా, రిస్క్‌లకు తగ్గ అనుకూల రాబడిని అందించగలవు. ఇవి ముఖ్యంగా పెట్టుబడికి భద్రత, పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు అనువైనవిగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లాంటి హైబ్రిడ్ ఫండ్లు మదుపరులకు మెరుగ్గా నిలుస్తున్నాయి. ఇవి సందర్భాన్ని బట్టి వివిధ సాధనాలకు వివిధ రకాలుగా కేటాయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈక్విటీలు, ఫిక్స్‌డ్ ఇన్‌కం, కమోడిటీల మధ్య పెట్టుబడులను అటూ, ఇటూ మారుస్తూ, రిస్క్‌లను సమర్ధవంతంగా అధిగమిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోగలిగే వెసులుబాటు వీటికి ఉంటుంది. ఈక్విటీ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో, బాండ్లపై రాబడులు స్థిరంగా ఉండగా.. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించే కమోడిటీలకు – ముఖ్యంగా బంగారానికి కూడా పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించడం కీలకంగా మారింది. ఎందుకంటే, సంక్లిష్టమైన స్థూలఆర్థిక పరిస్థితుల్లో రిసు్కలకు తగ్గ రాబడులను అందించే విషయంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
ఇలాంటి, అతి తక్కువ లేదా నెగిటివ్ కో–రిలేషన్ ఉన్న ఆర్థిక సాధనాలతో వైవిధ్యభరితంగా ఉండే పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడులు భారీగా పతనం కాకుండా కాస్త రక్షణ లభిస్తుంది. నెగటివ్ కో–రిలేషన్ అంటే, ఆర్థిక లేదా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈక్విటీ మార్కెట్ క్షీణించినప్పటికీ, సురక్షితమైన సాధనాలుగా పరిగణించే డెట్, పసిడిలాంటి సాధనాలు పెరుగుతాయి. ఇలా ఒడిదుడుకులు నెలకొన్నప్పుడు, పరస్పర విరుద్ధంగా వ్యవహరించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఇన్వెస్టర్లకు రిసు్కలను తగ్గించి, మెరుగైన రాబడినిచ్చే విధంగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి. ఇవి వివిధ సాధనాలవ్యాప్తంగా కేటాయింపులను సత్వరం మార్చగలిగే విధంగా పనిచేస్తాయి. అయితే, నిబంధనల ప్రకారం ఈక్విటీలకు తప్పనిసరిగా కనీసం 65 శాతమైన నిధులు కేటాయించాలి కాబట్టి, వీటిపై వచ్చే మూలధన లాభాలకు శ్లాబ్ రేట్ల వారీగా కాకుండా ఈక్విటీ ట్యాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల సాధన కోసం పన్నులు ఆదా అయ్యే మార్గాలను అన్వేషించే ఇన్వెస్టర్లు, ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఇవి సమీప భవిష్యత్తులో క్షీణత నుంచి రక్షణ, అలాగే పన్నులపరంగా ప్రయోజనాలు కల్పిస్తూనే దీర్ఘకాలికంగా పెట్టుబడి వృద్ధి అవకాశాలను కూడా అందిస్తూ, ఇన్వెస్టర్లకు అనువుగా ఉంటాయి.
