
జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది. జీఎస్టీ శ్లాబుల సవరణ.. కొత్త పన్ను రేట్లు నవరాత్రి పర్వదినానికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నాటికి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులను అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ ప్రాఫిట్ పేర్కొంది.
కేంద్రం ప్రతిపాదించిన 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు వ్యవస్థల జీఎస్టీ పన్ను శ్లాబులపై చర్చించేందుకు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సెస్, ఆరోగ్య, జీవిత బీమాపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ చర్చించనుంది. రాష్ట్ర మంత్రులతో కూడిన మంత్రుల బృందం (జివోఎం) ఇదివరకే సమావేశమై, రెండు శ్లాబుల జీఎస్టీపై కేంద్రం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత దాదాపు ఐదారు రోజుల తర్వాత జీఎస్టీ కొత్త రేట్ల అమలుపై నోటిఫికేషన్లు వెలువడుతాయని తెలుస్తోంది.
రెండే శ్లాబులు.. తక్కువ పన్నులు
కేంద్రం 5% (మెరిట్ వస్తువులకు), 18% (స్టాండర్డ్ వస్తువులకు) అనే రెండు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అదనంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక రేట్లు అమలవుతాయి. అల్ట్రా లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్‌పై 40 శాతం, కార్మికాధారిత రంగాలపై 0.1%, 0.3%, 0.5% రాయితీ రేట్లు కొనసాగుతాయి.
ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ నిర్మాణంలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబులు ఉన్నాయి. త్వరలో అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ నిర్మాణంలో 12%, 28% శ్లాబులను తొలగించనున్నారు. 5%, 18% శ్లాబుటు మాత్రమే కొనసాగుతాయి. తద్వారా అనేక వస్తువులపై పన్నులు తగ్గి వాటి ధరలు దిగిరానున్నాయి. అయితే రానున్నది పండుగ సీజన్ కాబట్టి ఎక్కువ కొనుగోళ్లకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పండగ సీజన్‌కు ముందే కొత్త రేట్లు అమల్లోకి వస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.