
హైదరాబాద్: భారతదేశంలో మెడికల్ సీట్లు పరిమితంగా ఉండటంతో అనేక మంది మధ్య తరగతి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే, విదేశీ మెడికల్ కోర్సుల్లో భారతీయ ఎన్‌ఎంసీ ప్రమాణాలకు సరిపోయే పాఠ్యక్రమం లేకపోవడం, క్లీనికల్ ప్రాక్టికల్ లోపించడం వల్ల, విద్యార్థులు తిరిగి భారత్‌కు వచ్చాక మెడికల్ రిజిస్ట్రేషన్ కోసం సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఈ లోపాన్ని పూరించేందుకు భారత్‌కు చెందిన జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థలు, ఇంపల్స్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ (ఉజ్బెకిస్తాన్), నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కలిసి తొలిసారి భారతీయ మెడికల్ పాఠ్యక్రమంతో కూడిన ఎంబీబీఎస్ ప్రోగ్రామ్‌ను ఉజ్బెకిస్తాన్, తాష్కెంట్ ప్రాంతంలో ప్రారంభించాయి.
ఈ కోర్సు ఎన్‌ఎంసీ - ఎఫ్‌ఎంజీఎల్ నియమావళి 2021 ప్రకారం పూర్తి అనుగుణంగా ఉందని, ఇక్కడ భారతీయ అధ్యాపకుల బృందం బోధిస్తారని జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థలు తెలిపాయి. సీబీఎంఈ ఆధారిత పాఠ్యక్రమం, భారతదేశంలో అవసరమైన వ్యాధులపై స్పెషలైజ్డ్ ట్రైనింగ్, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఈ కోర్సు ద్వారా లభిస్తుందని వివరించాయి.