
ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విడుదల
బుధవారం మధ్యాహ్నం వరకు అవకాశం
6,406 మంది అర్హులైన అభ్యర్థులతో కాళోజీ వర్సిటీ ఫైనల్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్ కోటా (బీ, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) విడుదల చేసింది.
బీ,సీ కేటగిరీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన 6,406 మందితో ఫైనల్ జాబితాను వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బుధవారం 24 మధ్యాహ్నం 2 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ రిజి్రస్టార్ కోరారు. ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు https:// tspvtmedadm. tsche. in వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
6,406 మంది అర్హులతో ఫైనల్ జాబితా
ఈనెల 20న యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన మేనేజ్‌మెంట్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్న నీట్ యూజీ అర్హులైన అభ్యర్థులే ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 26 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,120 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద కేటాయించారు. ఇందులో బీ కేటగిరీ కింద 1,480 సీట్లు ఉండగా, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 640 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీడీఎస్ కింద రాష్ట్రంలోని ఆర్మీ డెంటల్ కాలేజీతో పాటు 10 ప్రైవేటు డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద 543 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆర్మీ డెంటల్ కాలేజీలోని 43 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఆర్మీ సిబ్బంది వారసులకే కేటాయించనున్నారు. మిగతా 10 ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 50 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద కేటాయించారు. వీటిలో 30 సీట్లు లోకల్ కేటగిరీలో, 5 సీట్లు అన్ రిజర్వుడ్ కింద, మరో 15 సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయించనున్నారు. కాగా మెరిట్ అభ్యర్థులు కోర్సు, కళాశాల, కేటగిరీ (బీ, సీ/ఎన్‌ఆర్‌ఐ) వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
కాగా, కరీంనగర్‌కు చెందిన చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ప్రవేశాలు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఆధారంగా ఉంటాయని యూనివర్సిటీ స్పష్టం చేసింది. మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ముస్లిం మైనారిటీ విద్యార్థులకే కేటాయిస్తారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు అందుబాటులో లేకపోతే, చివరి దశలో గరిష్టంగా 30 శాతం వరకు నాన్–మైనారిటీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.