గతేడాది లాక్ డౌన్‌ అనుభవాల నుంచి పాఠాలు 

Fmcg Companies Learns About Past Lockdown Effect - Sakshi

సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల కసరత్తు

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసులు దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏవైనా అంతరాయాలు తలెత్తితే వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ మూవింగ్‌ కంజ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా తయారీ, సరఫరా సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరుకు నిల్వలను పెంచుకుంటున్నాయి. అలాగే సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. రోజువారీ కోవిడ్‌–19 కేసులు దేశంలో ఒక లక్ష మార్కును దాటిన సంగతి విధితమే. 

సమీపంలో నిల్వ కేంద్రాలు.. 
ఆకస్మికంగా ఏర్పడే స్థానిక లాక్‌డౌన్, అనిశ్చితి నుంచి గట్టెక్కడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమామి డైరెక్టర్‌ హర్హ వి అగర్వాల్‌ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, తయారైన, ముడి సరుకు, ప్యాకేజింగ్‌కు ఉపయోగించే పదార్థాలను నిల్వ చేసుకోవడం ద్వారా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నట్టు చెప్పారు. సాధ్యమైనంత వరకు విక్రయ ప్రాంతానికి సమీపంలో నిల్వ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. గతేడాది పాఠాల నేపథ్యంలో సరఫరా సమస్యలను తగ్గించడానికి కాల్‌ సెంటర్, వాట్సాప్‌ ద్వారా ఆర్డర్‌ బుకింగ్స్‌ను పెంచామని డాబర్‌ ఇండియా సేల్స్‌ ఈడీ ఆదర్శ్‌ శర్మ తెలిపారు. భవిష్యత్తులో ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని పంపిణీదార్లకు, దుకాణాలకు సరఫరాను అధికం చేశామని చెప్పారు.  

అంచనా వేయలేం.. 
కిరాణా దుకాణాల కోసం సరుకు నిల్వలను తగిన స్థాయిలో నిర్వహిస్తున్నట్టు మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా ఎండీ అరవింద్‌ మెదిరట్ట వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇవ్వడానికి వీలుగా ఈ–కామర్స్‌ యాప్‌ సైతం అందుబాటులో ఉందని చెప్పారు. స్థానికంగా లాక్‌డౌన్స్‌ ఎప్పుడు, ఎంత కాలం ఉంటాయో అంచనా వేయలేమని, సరఫరా అడ్డంకులూ ఉంటాయని చెప్పలేమని గోద్రెజ్‌ కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, సార్క్‌ సీఈవో సునీల్‌ కటారియా వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు నిల్వలు చేసుకుంటున్నట్టు చెప్పారు. 

చదవండి: ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో ఆన్‌లైన్‌ జోరు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top