
గత దశాబ్ద కాలంలో భారత్ 17 కోట్ల ఉద్యోగావకాశాలను సృష్టించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సీఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొని మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ రేటు 3.2 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే స్థాయిలో ఉందన్నారు. భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారినందున గణనీయంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గత దశాబ్ద కాలంలో భారత్‌లో 17 కోట్ల ఉద్యోగావకాశాలు లభించాయి. అంతకుముందు దశాబ్దంలో ఇచ్చిన 4.5 కోట్ల ఉద్యోగాల కంటే ఎంతో అధికం. భారత్ పారదర్శక ప్రజాస్వామ్య దేశం. మెరుగైన న్యాయవ్యవస్థ, పటిష్టమైన విధానాల వల్లే ప్రపంచంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ మారింది. దాంతోపాటు దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతోంది. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు’ అన్నారు.
దేశంలోని ప్రతి యూనివర్సిటీలో ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయిమెంట్ లాంజ్(విద్య తర్వాత ఉద్యోగం వచ్చేలా విధానాలు)’ ఉంటుందని, దీన్ని పారిశ్రామిక సంస్థలు నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విశ్వవిద్యాలయాల సహకారంతో దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కెరియర్ లాంజ్‌లో యువతకు వారి అర్హతను బట్టి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్
పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ అవసరాన్ని నొక్కిచెప్పిన మంత్రి, సీఐఐ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో, వారి అవసరాల గురించి వివరాలను పంచుకోవడంలో ప్రభుత్వానికి సహాయపడతాయని అన్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను బట్టి విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థలు యువతకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తాయని, తద్వారా వారు ఉద్యోగాలు పొందడానికి దోహదపడుతుందని వివరించారు.