
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్‌లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్‌లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్‌గా ఎదగడానికి భారత్‌కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.
యూఎస్‌లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలు
నర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.
నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.
వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
వీసా విధానాలు
వీసా పేరు | ఉపయోగం / లక్ష్యం |
---|---|
H‑2A | వ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది. |
H‑2B | వ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి) |
L‑1 | కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్, మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లు |
O‑1 | అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ |
ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?