కొత్త ఈ-పాస్‌ పోర్ట్‌లను హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు..!

e-Passports To Have Advanced Security Features: Govt - Sakshi

న్యూఢిల్లీ: రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ-పాస్‌ పోర్ట్‌లను త్వరలో జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడి వ్యక్తిగత వివరాలు పాస్ పోర్ట్ బుక్ లెట్'లో పొందుపరిచిన చిప్‌లో డిజిటల్ రూపంలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం ఈ- పాస్‌ పోర్ట్‌లను జారీ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. 

"దేశ పౌరులకు అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన చిప్ ఆధారిత ఈ- పాస్‌ పోర్ట్‌లను జారీ చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ పాస్ పోర్ట్ లో కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్ టెక్నాలజీ ఉంటుంది. పాస్ పోర్ట్ ముందు లేదా వెనుక కవర్ లేదా పేజీలో పొందుపరిచిన ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్ కూడా ఉంటుంది"అని ఈ- పాస్‌ పోర్ట్‌లపై అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలిపారు. ఇందులో ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థ అయిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఎఒ) మార్గదర్శకాలకు అనుగుణంగా "చిప్ లక్షణాలు" ఉన్నాయని ఆయన అన్నారు. 

"దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు చిప్‌లో డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. ఈ చీప్ భౌతిక పాస్ పోర్ట్ బుక్ లెట్ ఉంటుంది" అని మంత్రి తెలిపారు. "ఒకవేళ ఎవరైనా చిప్‌లను హ్యాక్ చేసినట్లయితే, కేంద్రం దగ్గర ఉన్న సీస్టమ్ దానిని గుర్తిస్తుంది. ఫలితంగా ఆ పాస్ పోర్ట్‌ను రద్దు చేస్తారని" ఆయన అన్నారు. దీంతో మోసాలు, ట్యాంపరింగ్ నుంచి దేశ పౌరులకు రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో 93 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీసు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని మురళీధరన్ తెలిపారు. ఈ కొత్త సీస్టమ్ వల్ల విమానాశ్రయాల వద్ద చెకింగ్ టైమ్ కూడా తగ్గుతుంది అని తెలిపారు.

(చదవండి: ఈ రూల్‌ ఫాలో కాకుంటే..! మీ చెక్‌ బౌన్స్‌ అయ్యే అవకాశం..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top