
దుబాయ్‌కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.
గల్లంతైన సంస్థ..
గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.
క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.
నష్టపోయిన భారత ఇన్వెస్టర్లు
గల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.
మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్‌షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.
కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్‌సీఏ అనుమతి లేదని నిర్ధారించారు.