ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌ హవా.. అందుబాటులో 8.85 కోట్ల చదరపు అడుగులు

Details About Office Space Availability In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో మిశ్రమ పవనాలు వీచాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణం విషయంలో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గతేడాది హెచ్‌2లో పూర్తయిన ఆఫీస్‌ స్పేస్‌లో క్షీణత నమోదయింది. 2020 హెచ్‌2లో 46 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ పూర్తి కాగా.. గతేడాది హెచ్‌2 నాటికి 21 శాతం క్షీణతతో 38 లక్షల చ.అ.లకు తగ్గింది. ఇక, గతేడాది హెచ్‌2లో 44 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల లావాదేవీలు జరిగాయి. 2020 హెచ్‌2తో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధి. గతేడాది మొత్తంగా చూస్తే నగరంలో 60 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. కొత్తగా 46 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలో 8.85 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ స్టాక్‌ ఉంది. 2020తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ.  

ఈసారి తయారీ రంగానిది హవా.. 
గతేడాది హెచ్‌2లోని ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలలో 35 శాతం తయారీ రంగం ఆక్రమించింది. ఐటీ, ఫార్మాతో పాటూ తయారీ రంగం కూడా నగరంలో కేంద్రీకరించుకోవటం శుభపరిణామమనే చెప్పాలి. గతేడాది రాయదుర్గంలోని రహేజా కామర్‌జోన్‌లో 1.5 మిలియన్‌ చ.అ. స్పేస్‌ను కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కంపెనీ క్వాల్కమ్‌ లీజుకు తీసుకుంది. ఇప్పటికే నగరంలో డెల్, ఇంటెల్, హెచ్‌పీ వంటి సంస్థల తయారీ కేంద్రాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ తర్వాత 18 శాతం ఐటీ కంపెనీలు, 21 శాతం కో–వర్కింగ్‌ స్పేస్‌ ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్‌2లోని ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలలో 92 శాతం హైటెక్‌ సిటీ, కొండాపూర్, మణికొండ, కూకట్‌పల్లి, రాయదుర్గం వంటి సబర్బన్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (ఎస్‌బీడీ)లోనే జరిగాయి. రహేజా కామర్‌జోన్, దివ్యశ్రీ, రహేజా మైండ్‌స్పేస్, ఫీనిక్స్‌ అవాన్స్‌ హబ్‌ వంటి బిజినెస్‌ కేంద్రాలలో ప్రధాన లావాదేవీలు జరిగాయి. ఆఫీస్‌ స్పేస్‌ ధరలలో అరశాతం వృద్ధి నమోదయింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top