కార్పొరేట్‌ ఫలితాలు, ఫెడ్‌ పాలసీలే కీలకం

Corporate results and Fed policy based on stock markets - Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ప్రపంచ పరిణామాలపైనా దృష్టి

ఎఫ్‌అండ్‌ఓ ముగింపు నేపథ్యంలో తడబాటుకు అవకాశం

భయపెడుతున్న డెల్టా వేరియంట్‌ పెరుగుదల కేసులు 

రెండు ఐపీఓలు, ఒక లిస్టింగ్‌ 

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం

ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిమాణాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, కోవిడ్‌ డెల్టా వేరియంట్‌ వైరస్‌ వ్యాప్తి తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. జూలై డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో సూచీలు తడబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.  

డెల్టా వేరియంట్‌ కేసుల అనూహ్య పెరుగుదల, ఆర్థిక వృద్ధి ఆందోళనలతో గతవారం నాలుగురోజుల ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్‌ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్‌ 164 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి. అయితే అదేవారంలో విడుదలైన కార్పొరేట్‌ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి.  

 ‘‘యూఎస్, యూరప్‌ మార్కెట్లు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు సైతం ఆల్‌టైం హైకి చేరువలో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లు రాణిస్తే సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చు. తర్వాత గరిష్ట స్థాయిల్లో కొంత స్థిరీకరణ జరగవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది. దిగువస్థాయిలో 15,800 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ ఖేమా అభిప్రాయపడ్డారు.  

 అందరి చూపు ఫెడ్‌ సమావేశం వైపే...
అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(జూన్‌ 27న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి.

ఎఫ్‌అండ్‌ఓ ముగింపునకు ముందు అప్రమత్తత  
ఈ గురువారం జూలై సీరీస్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌(ఎఫ్‌అండ్‌ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఆగస్ట్‌ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను స్కోర్‌ ఆఫ్‌ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో మార్కెట్‌ కొంత ఒడిదుడకులకు లోనుకావచ్చు.   

గురువారం తత్వ చింతన్‌ ఫార్మా లిస్టింగ్‌ ...
స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ కంపెనీ తత్వ చింతన్‌ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఐపీఓ ఈ జూలై 16–20 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 1,073–1,083 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను విక్రయానికి ఉంచగా.., 58.83 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. 180 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.1,083తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.1,000 ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్‌ రోజు 92% లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది.  

ఇదే వారంలో రెండు ఐపీఓలు  
రెండు కంపెనీలు ఇదే వారంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఐపీఓ జూన్‌ 27 ప్రారంభమై, ఇదే నెల 29న ముగుస్తుంది. షేరుకి ధరల శ్రేణి రూ.695–720గా నిర్ణయించి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 1,513.6 కోట్లను సమకూర్చుకోనుంది. మరో కంపెనీ రోలాక్స్‌ రింగ్స్‌ ఇష్యూ 28–30 తేదీల మధ్య జరనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.56 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది.  

కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు  
స్టాక్‌ మార్కెట్‌ ముందుగా రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు  తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, నెస్లే, మారుతీ, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, బ్రిటానియా, యూపీఎల్, ఐఓసీలతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని  కంపెనీలున్నాయి. జూన్‌ క్వార్టర్‌ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.

ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు  
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై 1–23 తేదీల మధ్య రూ.5,689 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల వ్యాల్యూయేషన్లు, యూఎస్‌ కరెన్సీ డాలర్‌ విలువ, క్రూడాయిల్‌ ధరలు పెరిగిపోవడంతో స్వల్పకాలిక రిస్క్‌ దృష్ట్యా మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top