
వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో ఎగుమతులను ఇతోధికం చేసుకునే దిశగా కేంద్ర సర్కారు చర్యలపై దృష్టి సారించింది. వాణిజ్య ఒప్పందాలపై చర్చలను వేగవంతం చేయడంతోపాటు, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం ద్వారా ఎగుమతులు పెంచుకోవాలని భావిస్తోంది. ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంతోపాటు, ఎగుమతులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం, ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడం, దిగుమతుల్లోనూ వైవిధ్యంపై వాణిజ్య శాఖ దృష్టి సారించినట్టు ఆ శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు.
సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందానికి అమోదాన్ని వేగవంతం చేయాలని యూకేని కోరినట్టు చెప్పారు. ఈ ఏడాది జూలై 24న దీనిపై రెండు దేశాలు సంతకాలు చేయడం గమనార్హం. ఐరోపా సమాఖ్య (ఈయూ)తోనూ చర్చలను వేగవంతం చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది చివరికి ముగింపునకు రావొచ్చన్నారు. ఒమన్‌తో సంప్రదింపులు ముగిశాయని, రెండు దేశాలకు అనుకూలమైన తేదీన ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్టు చెప్పారు. ఇక న్యూజిలాండ్, పెరూ, చిలీతోనూ చర్చలు పురోగతితో సాగుతున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబన
10 దేశాల ఆసియా కూటమితోనూ సమీక్షపై సంప్రదింపులు చేస్తున్నట్టు భత్వాల్ తెలిపారు. ప్రధానంగా 50 దేశాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహానికి పలు పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, వాటిని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దిగుమతులకు కొన్ని దేశాలపైనే ఎక్కువగా ఆధారపకుండా వైవిధ్యం చేసుకోవాల్సి ఉందన్నారు.