
భారత పశు వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి వ్యూహాత్మక విధానాలు అవసరమని కాంపౌండ్ లైవ్‌స్టాక్ ఫీడ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎల్‌ఎఫ్‌ఎంఏ) ఛైర్మన్ డాక్టర్ దివ్యకుమార్ గులాటీ అన్నారు. సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ వార్షిక సాధారణ సమావేశం, 66వ జాతీయ సింపోజియం హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
‘ప్రస్తుత ఆహారోత్పత్తి ఖర్చుతో మొక్కజొన్న పంటలో సుస్థిరత సాధ్యం కాదు. దిగుబడి పెంచేందుకు చేసే ఫీడ్ ఫార్ములేషన్లు నియంత్రణ, నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. ఉన్న పంటలో ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వ మద్దతుతో ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాల నవీకరణలు అవసరం. రైతు కేంద్రీకృత విధానాలు రూపొందించాలి. ఈ మేరకు చర్యలు తీసుకోకపోతే దాణాకు సంబంధించి భారత్ నికర దిగుమతిదారుగా మారే ప్రమాదం ఉంది’ అని గులాటీ తెలిపారు.
పశుపోషణ వ్యవసాయ జీడీపీలో దాదాపు మూడింట ఒక వంతు దోహదం చేస్తుంది. పౌల్ట్రీ, డెయిరీ, ఆక్వాకల్చర్ రైతుల సమ్మిళిత ప్రాతినిధ్యాన్ని సీఎల్‌ఎఫ్‌ఎంఏ పిలుపునిచ్చింది. పశువుల కోసం ఎగుమతి ఆధారిత జోన్లు ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించారు. భారతదేశం ఏటా 60 మిలియన్ మెట్రిక్ టన్నుల జంతు దాణాను ఉత్పత్తి చేస్తుంది. పౌల్ట్రీ ఫీడ్ మాత్రమే 22 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను వినియోగిస్తుంది. ఇది జాతీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 50% కంటే ఎక్కువ. పెరుగుతున్న ఇథనాల్ అవసరాలు మొక్కజొన్నను దాణాకు దూరం చేస్తోంది. ఇది కోళ్ల మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. పౌల్ట్రీలో 8-10% వార్షిక పెరుగుదలతో దాణా కొరత దిగుమతి అధికమవుతోంది. ఇది ధరల అస్థిరతకు దారితీస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి, బయోసెక్యూరిటీ ప్రమాదాలు సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్!