ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నంద్యాల జిల్లా ఆత్మకూరు యార్డులో తడిసిపోయిన మొక్కజొన్న
కోతలు ప్రారంభమై 45 రోజులైనా జాడలేని కొనుగోలు కేంద్రాలు
పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు
దళారీలు, వ్యాపారుల దోపిడీకి గురవుతున్న రైతులు
కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400
రైతులకు దక్కుతున్నది రూ.1,900 లోపే
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు కరువైంది. అగ్రివాచ్‌తో పాటు వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఎఎంఐసీ) ముందస్తు అంచనా ధరల కంటే దిగజారిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కోతలు ప్రారంభమై 45 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలోచన చేయకపోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. మార్కెట్‌లో మద్దతు ధర దక్కక పోవడంతో వ్యాపారులు, దళారీల చేతిలో నిలువు దోపిడికి గురవుతున్నారు.
భారీగా తగ్గిన దిగుబడులు
ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3.32 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది సాగు లక్ష్యం 3.62 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. కాగా, లక్ష్యానికి మించి 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. నంద్యాల, అనంతపురం, సత్యసాయి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, ప్రకాశం జిల్లాలో అధిక సాగు నమోదయ్యింది. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే దిగుబడులు సగటున 25–35 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, అధిక వర్షాల ప్రభావంతో 20–23 క్వింటాళ్లకుమించి రాని పరిస్థితి నెలకొంది. నాణ్యత కూడా పడిపోవడంతో మార్కెట్‌లో మద్దతు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది.
ధరల అంచనా తారుమారు
ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరగా క్వింటా రూ.2400గా కేంద్రం ప్రకటించింది. కాగా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ధరలను అంచనా వేసే మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఎఎంఐసీ) ప్రకటించిన ముందస్తు ధరల అంచనా ప్రకారం కోతలు ప్రారంభమయ్యే సమయానికి ధర రూ.2,335–2,625 మధ్య పలకాల్సి ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో క్వింటా రూ.1,600 నుంచి రూ.1,900కు మించి పలకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు రైతులు నష్టపోతున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచే కోతలు మొదలయ్యాయి.
రైతుల గోడు పట్టని చంద్రబాబు
కోతల సమయంలో అధిక వర్షాలు, ఆ తర్వాత మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు మొక్కజొన్న రైతులను కోలుకోలేని దెబ్బతీసాయి. దీంతో తేమశాతం అధికంగా ఉంటోంది. ఆరుదల కోసం రోజుల తరబడి ఎండలో ఆరబెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. మొక్కజొన్న విత్తనాలను ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యార్డులో ఆరబెడుతున్న రైతులు ప్రత్యేకంగా కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమైన సమయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే మాకీ తిప్పలు ఉండేవి కావని చెబుతున్నారు. మార్కెట్‌లో కొనేవారు లేకపోవడంతో రైతులు దళారీలను ఆశ్రయించి, నష్టపోవాల్సి వస్తోంది.


