
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్‌బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్‌లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ మోడల్‌ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
స్పైకింగ్‌బ్రెయిన్.. చాట్‌జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్‌లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.
స్పైకింగ్‌బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్‌ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది.