రిటైర్‌మెంట్‌ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి

Best Options For Good Income To Secure After Retirement Life - Sakshi

పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నాను. పోస్ట్‌ ఆఫీసు, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్, కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాలకు అదనంగా.. నెలవారీగా స్థిరమైన ఆదా యం కోసం న్యూజీవన్‌ శాంతి మాదిరి యాన్యుటీ ప్లాన్‌లో రూ.20 లక్షలు ఇన్వెస్ట్‌ చేయనా?     – నితిన్‌ 
ఇది మంచి ఆలోచన కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాన్యుటీ ప్లాన్లు సరైన నాణ్యత కలిగినవి కావు. యాన్యుటీల్లోనూ వివిధ రకాలున్నాయి. జీవించి ఉన్నంత కాలం హామీ మేరకు స్థిరమైన ఆదాయన్నిచ్చేవి ఒక రకం. మరొక రకంలో ముందుగా నిర్ణయించిన మేర క్రమం తప్పకుండా పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పాటు చెల్లింపులు కొనసాగుతాయి. పాలసీదారు మరణానంతరం అసలు పెట్టుబడి నామినీకి అందజేస్తారు. నిర్ణీత కాలానికోసారి చెల్లింపులు పెరిగే యాన్యుటీ పథకాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల యాన్యుటీల్లోనూ రాబడులు చాలా తక్కువగానే ఉన్నాయి. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పాటు చెల్లింపులు చేయాల్సిన రిస్క్‌ను బీమా కంపెనీలు తీసుకోవడమే రాబడులు తక్కువగా ఉండడానికి కారణం. ఎందుకంటే ఎవరు ఎంత కాలం పాటు జీవించి ఉంటారన్నది తెలియదు కనుక. కొందరు సుదీర్ఘకాలం పాటు జీవించి ఉండొచ్చు. పోస్ట్‌ ఆఫీస్‌ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐపీ), సీనియస్‌ సిటిజన్‌ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత.. అదనంగా మార్కెట్‌ ఆధారిత పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చన్నది నా సూచన. కొంత భాగం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు అందుకోవచ్చు. స్వల్పకాలానికి ఇన్వెస్ట్‌ చేసేట్టే అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్‌ ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ తగ్గిపోతుంది. అయినా రక్షణాత్మకంగానే వ్యవహరించాలి. పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో పెట్టేయకూడదు. పెట్టుబడులన్నీ ఒకేసారి కాకుండా ఏడాది నుంచి 18 నెలల కాలంలో పెట్టే విధంగా చూసుకోండి. 

మూడేళ్ల క్రితం సిప్‌ మార్గంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టాను. మార్కెట్‌ పడిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో పెట్టుబడులను డెట్‌ పథకాల్లోకి మళ్లించుకోవాలా? లేదంటే మార్కెట్‌ పతనాన్ని అవకాశంగా భావించి మరింత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసుకోవాలా?    – సీహెచ్‌. సాగర్‌ 
మొదట ఆందోళన అన్నది అనవసరం. ఒకవేళ ఏడాది క్రితమే మీరు ఈ విషయమై ఆందోళన చెంది ఉంటే.. ఈక్విటీల నుంచి స్థిరాదాయ పథకాలకు (డెట్‌సాధనాలు) మళ్లిపోయి ఉండేవారు. గత 18 నెలల్లో చాలా మంది ఇలా ఆందోళన చెందినవారే. కానీ, మార్కెట్‌ ర్యాలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్కెట్‌ క్రమంగా పెరుగుతూనే వెళ్లింది. ఎవరైతే ఆందోళన చెంది ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారో.. దీర్ఘకాలంలో వచ్చే అరుదైన అవకాశాన్ని వారు కోల్పోయారు. అందుకే ఆందోళన అన్నది పనికిరాదు. రెండు అంశాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చే 10–15 ఏళ్ల వరకు డబ్బులతో అవసరం లేదనుకుంటే ఈక్విటీల్లోనే పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. మీరు గడిచిన మూడేళ్ల నుంచే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. మీ పెట్టుబడులు ఇంకా వృద్ధి చెందాల్సి ఉంది. మీ ప్రణాళిక ప్రకారమే నడుచుకోవాలి తప్పిదే ఆందోళన వద్దు. మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చినా.. అది ఎప్పుడన్నది ఎవరూ అంనా వేయలేరు? ప్రస్తుత పరిస్థితులే వచ్చే ఆరు నెలల పాటు కొనసాగొచ్చు. లేదంటే రెండేళ్లపాటు ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్లు పడితే ఎప్పుడు తిరిగి కోలుకుంటాయన్నది తెలియదు. ఒక నెల పాటు కొనసాగొచ్చు. లేదంటే 2020 మార్చిలో మాదిరిగా ఉండొచ్చు. ఆందోళన అన్నది తప్పుడు నిర్ణయానికి దారితీయవచ్చు. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయగలరు, ఎంతకాలం పెట్టుబడులను కొనసాగించగలరన్న అంశాల ఆధారంగా ప్రణాళిక ఉండాలి. ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టి మూడేళ్లే అయింది కనుక పెద్ద మొత్తంలో ఇంకా సమకూరి ఉండకపోవచ్చు. అందుకే కనీసం పదేళ్లపాటు అయినా పెట్టుబడులను కొనసాగించాలి. అది కూడా వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల సమతూకాన్ని (అస్సెట్‌ అలోకేషన్‌) నిర్ణయించుకుని అడుగులు వేయాలి. నిర్ణీత కాలానికోసారి ఈ పెట్టుబడులను మీ ప్రణాళికకు తగినట్టు మార్పులు చేసుకుంటూ వెళ్లాలి.

- ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వాల్యూ రీసెర్చ్‌

చదవండి: జుపీ నిధుల సమీకరణ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top