అమ్మో లక్ష! బెంగళూరు ఇంటి అద్దె వైరల్‌ | bengaluru 3bhk flat rent viral social media debate | Sakshi
Sakshi News home page

అమ్మో లక్ష! బెంగళూరు ఇంటి అద్దె వైరల్‌

May 27 2026 7:46 PM | Updated on May 27 2026 9:06 PM

bengaluru 3bhk flat rent viral social media debate

బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఇండ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగుల మాట దేవుడెరుగు... నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే టెక్కీలు సైతం ఇక్కడి అద్దెలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నగరంలో ఓ 3బీహెచ్‌కే (3BHK) ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నగరంలో నివాస వ్యయంపై మరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది.

రూ. 1.1 లక్షల అద్దె.. 4 లక్షల డిపాజిట్!
నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ ‘ఎంబసీ గోల్ఫ్ లింక్స్ బిజినెస్ పార్క్’కు అత్యంత సమీపంలో, డోమ్లూర్ - ఇందిరానగర్ పరిసరాల్లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. సుమారు 1,800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ సెమీ-ఫర్నిష్డ్ కార్నర్ ఫ్లాట్ నెలవారీ అద్దె అక్షరాలా రూ. 1.1 లక్షలు. ఇది చాలదన్నట్టు దీనికి రూ. 4 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు, ప్రతి నెలా అదనంగా రూ. 6,000 మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెర్రస్, పూజా గది, మాడ్యులర్ కిచెన్, ఉచిత స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టు వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఈ ఫ్లాట్‌లో ఉన్నాయట.

వామ్మో అంటున్న నెటిజన్లు
ఈ అద్దె వివరాల స్క్రీన్‌షాట్లు నెట్టింట వైరల్ కావడంతో ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బెంగళూరులో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె రూ. 1.1 లక్షలా? నిజానికి ఇది ఒక సగటు ఉద్యోగి నెలవారీ జీతం" అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులకు దగ్గరగా ఉండాలంటే జీతాన్నంతా అద్దెలకే తగలేయాలి, లేదా ట్రాఫిక్‌లో గంటల తరబడి నరకం చూడాలి.. ఐటీ నిపుణుల పరిస్థితి ‘ముందు నయ్యం.. వెనుక గొయ్యి’లా తయారైందని పలువురు వాపోతున్నారు.

ఇటువంటి పిచ్చి అద్దెలను డిమాండ్ చేసినా చెల్లించేందుకు కొందరు సిద్ధపడటం వల్లే యజమానులు మరింతగా రెచ్చిపోతున్నారని, ఒకే ఫ్లాట్‌ను నలుగురైదుగురు కలిసి పంచుకోవడం వల్లే ఈ ధరలు అదుపు తప్పాయనే విమర్శలు వస్తున్నాయి.

అయితే, ఈ స్థాయి అద్దె ధరలు మార్కెట్ పరంగా సమర్థనీయమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణ ముంబై లాంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పోల్చదగ్గ ఇందిరానగర్ వంటి లొకేషన్లలో ఈ మాత్రం రేట్లు ఉండటం సహజమేనని వాదిస్తున్నారు. ఇక్కడ నివసించే వారి వార్షిక ఆదాయాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల పైమాటేనని గుర్తు చేస్తున్నారు.

మరోవైపు రియల్ ఎస్టేట్ సమీకరణాలను తెరపైకి తెస్తూ.. "ప్రస్తుతం ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే అద్దె, కనీసం బ్యాంక్ వడ్డీ రేటులో సగం కూడా ఉండదు. అలాంటప్పుడు యజమానులు అద్దెలు పెంచడంలో తప్పు లేదు" అని ఇన్వెస్టర్ల కోణాన్ని కొందరు విశ్లేషించారు.

మొత్తానికి బెంగళూరుతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గృహాల కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఐటీ కారిడార్లలో అద్దెలు సామాన్యుల నియంత్రణ తప్పుతున్నాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ టికెట్‌ బుకింగ్‌లో కొత్త పద్ధతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement