రైల్వే తత్కాల్ టికెట్‌ బుకింగ్‌లో కొత్త పద్ధతి! | indian railways new tatkal ticket booking token system | Sakshi
Sakshi News home page

రైల్వే తత్కాల్ టికెట్‌ బుకింగ్‌లో కొత్త పద్ధతి!

May 25 2026 4:14 PM | Updated on May 25 2026 4:53 PM

indian railways new tatkal ticket booking token system

రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసే ప్రయాణికుల ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని ప్రతిష్టాత్మక కోటా డివిజన్ తన పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో వినూత్నమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కోటా డివిజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?
కౌంటర్ల వద్ద క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు రైల్వే శాఖ ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికులు ముందుగా నిర్ణయించిన సమయానికి బుకింగ్ కార్యాలయానికి చేరుకోవాలి. కౌంటర్ సిబ్బంది నుండి కేటగిరీకి సంబంధించిన టోకెన్‌ను తీసుకోవాలి. టోకెన్ నంబర్ల వరుస క్రమం ఆధారంగానే ప్రయాణికులను కౌంటర్ వద్దకు అనుమతిస్తారు. మీ వంతు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తత్కాల్ టికెట్ పొందవచ్చు.

టోకెన్ పంపిణీ సమయాలు ఇవే..
తత్కాల్ బుకింగ్ ప్రారంభం కావడానికి ముందే కౌంటర్ల వద్ద ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఏసీ క్లాస్ (AC Classes) కేటగిరీ ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 వరకు టోకెన్లు ఇస్తారు. ఉదయం 10:00 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభవుతుంది. ఇక స్లీపర్ క్లాస్ (Sleeper Class) ప్రయాణికులకు ఉదయం 9:30 నుండి 9:55 వరకు టోకెన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం మొదలవుతుంది. సాధారణ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందే తత్కాల్ విండో తెరుచుకుంటుంది. కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా డిజిటల్‌గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

రైల్వే చార్ట్ తయారీలో మార్పులు
ప్రయాణికుల సౌకర్యార్థం రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాలను కూడా రైల్వే శాఖ ఇటీవల పునరుద్ధరించింది. ఉదయం 05:01 నుండి మధ్యాహ్నం 14:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ప్రయాణానికి ముందటి రోజు రాత్రి 20:00 గంటల (8:00 PM) లోపు మొదటి చార్ట్ సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 14:01 నుండి రాత్రి 23:59 వరకు, అర్ధరాత్రి 00:00 నుండి తెల్లవారుజామున 05:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు రైలు ప్రయాణ సమయానికి కనీసం 10 గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేశారు.

రైల్వే కౌంటర్ల వద్ద దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు కోటా డివిజన్ తెచ్చిన ఈ టోకెన్ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇదే పద్ధతిని ఇతర రైల్వే డివిజన్లలోనూ అమలు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement