సరిహద్దు రాష్ట్రాల్లోనే భారీగా బ్యాంకు డిపాజిట్లు.. | Banks keep a close watch on border states as India Pakistan conflict escalates | Sakshi
Sakshi News home page

సరిహద్దు రాష్ట్రాల్లోనే భారీగా బ్యాంకు డిపాజిట్లు..

May 9 2025 1:10 PM | Updated on May 9 2025 3:51 PM

Banks keep a close watch on border states as India Pakistan conflict escalates

భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ పరిస్థితులు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. పాకిస్తాన్‌పై ఓవైపు మెరుపుదాడులతో విరుచుకుపడుతూనే మరోవైపు సరిహద్దు వెంబడి ఆ దేశం చేస్తున్న దాడులను భారత్‌ సైనిక దళాలు తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ కొనసాగుతోంది. అయితే ఈ సరిహద్దు రాష్ట్రాల్లోనే గణనీయమైన డిపాజిటర్ బేస్‌ ఉండటంతో బ్యాంకింగ్ రంగం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది.

జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశ మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 12.81 శాతం అంటే రూ .26.21 లక్షల కోట్లు ఆ అయిదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే మొత్తం అడ్వాన్సులలో 13.41 శాతం అంటే రూ .22.13 లక్షల కోట్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి.

జమ్ముకశ్మీర్‌లో..
ఘర్షణకు కేంద్ర బిందువైన కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అస్థిర నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)తో సహా పాకిస్థాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. జమ్ముకశ్మీర్ బ్యాంకుల్లో రూ.1.49 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇవి దేశ డిపాజిట్లలో 0.73 శాతం. అడ్వాన్సులు రూ .73,879 కోట్లు. మొత్తం అడ్వాన్స్‌లలో 0.45 శాతం.

పంజాబ్‌లో..
భారత్‌లో మరో ముఖ్యమైన సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌. ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ తో 547 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దేశంలోని మొత్తం డిపాజిట్లలో 3 శాతం అంటే రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నాయి. ఇక 
రూ.5.35 లక్షల కోట్ల మేర (3.24 శాతం) రుణాలను ఇక్కడి బ్యాంకులు వితరణ చేశాయి.

రాజస్థాన్
పాకిస్థాన్ లోని సింధ్, పంజాబ్ ప్రావిన్సుల వెంబడి 1,035 కిలోమీటర్ల ఎడారి సరిహద్దు కలిగిన రాజస్థాన్ లో రూ.6.98 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు (3.41 శాతం), రూ.6.25 లక్షల కోట్లు (3.79 శాతం) అడ్వాన్సులు ఉన్నాయి.

గుజరాత్
సర్ క్రీక్, రాన్ ఆఫ్ కచ్ వెంబడి పాకిస్తాన్ తో 508 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ ఈ రాష్ట్రాలలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. ఇక్కడి బ్యాంకుల్లో రూ.10.8 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు (5.27 శాతం), రూ.9.45 లక్షల కోట్లు (5.73 శాతం) రుణాలు ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్
పాకిస్తాన్ తో నేరుగా సరిహద్దును పంచుకోనప్పటికీ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లకు దగ్గరగా ఉండటం వల్ల హిమాచల్ ప్రదేశ్ కూడా ఉద్రిక్తతల వలయంలో ఉంది. దేశ డిపాజిట్లలో 0.4 శాతం అంటే రూ.81,840 కోట్లు, అడ్వాన్సుల్లో 0.2 శాతం అంటే రూ.32,736 కోట్లు ఇక్కడి బ్యాంకులకు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement