యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ. 7,071 కోట్లు | Axis Bank Q4 net profit slips marginally to Rs 7071 crore | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ. 7,071 కోట్లు

Apr 26 2026 3:42 AM | Updated on Apr 26 2026 6:43 AM

Axis Bank Q4 net profit slips marginally to Rs 7071 crore

క్యూ4లో స్వల్పంగా క్షీణత 

నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్‌ 

రూ.1 డివిడెండు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,071 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 7,118 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 0.64 శాతం మేర తగ్గింది. సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం సుమారు 5 శాతం పెరిగి రూ. 14,457 కోట్లకు చేరింది.

ఒక్కో షేరుపై రూ. 1 చొప్పున డివిడెండు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో వన్‌ టైమ్‌ ప్రాతిపదికన అదనంగా రూ. 2,001 కోట్ల ప్రొవిజనింగ్‌ చేసినట్లు బ్యాంకు తెలిపింది. అనిశ్చితి పెరిగినప్పుడు రిస్క్‌ గవర్నెన్స్‌లో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉండేలా చూసుకోవడంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు వివరించింది.

గత ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరును కనపర్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ చౌదరి తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి మరింత ఆశావహంగా అడుగుపెడుతున్నామని, సంస్థను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనుబంధ సంస్థ యాక్సిస్‌ ఫైనాన్స్‌కి కేదారా క్యాపిటల్‌తో కలిసి రూ. 2,250 కోట్లు సమకూరుస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.   

ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. 
4వ త్రైమాసికంలో మొండిపద్దుల్లాంటి వాటికి కేటాయింపులు రూ. 3,522 కోట్లుగా ఉన్నాయి.  
⇒  మార్చి 31 నాటికి బ్యాలెన్స్‌ షీట్‌ 17 శాతం వృద్ధితో రూ. 18,86,850 కోట్లకు చేరింది. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు 11 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్లు 11 శాతం, టర్మ్‌ డిపాజిట్లు 16 శాతం పెరిగాయి. 

⇒ మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా క్యూ3లో 39 శాతంగా ఉండగా, క్యూ4లో స్వల్పంగా పెరిగి 40 శాతానికి చేరింది.  
⇒  రుణాలు 19 శాతం పెరిగి రూ. 12,33,57 కోట్లకు చేరాయి. రూ. 6,73,468 కోట్లతో మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 55 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 26 శాతంగా ఉన్నాయి. స్మాల్‌ బిజినెస్‌ బ్యాంకింగ్‌ 17 శాతం, ప్రాపరీ్టపై రుణాలు 16 శాతం, వ్యక్తిగత రుణాలు 6 శాతం మేర పెరిగాయి. కార్పొరేట్‌ రుణాలు 38 శాతం వృద్ధి చెందాయి.  

⇒  స్థూల మొండిబాకీలు డిసెంబర్‌ త్రైమాసికం ఆఖర్లో 1.40%గా ఉండగా 1.23 శాతానికి, నికర మొండిబాకీలు 0.42% నుంచి 0.37 శాతానికి నెమ్మదించాయి. రైటాఫ్‌ చేసిన ఖాతాల నుంచి రూ. 1,197 కోట్లు రికవర్‌ అయ్యాయి.  

⇒ నాలుగో త్రైమాసికంలో స్థూల స్లిపేజీలు రూ. 4,709 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి క్యూ3లో రూ. 6,007 కోట్లుగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 4,805 కోట్లుగా ఉన్నాయి. తాజా క్యూ4లో మొండిబాకీల రికవరీ, అప్‌గ్రేడింగ్‌ రూ. 2,696 కోట్లుగా ఉంది. ఈ వ్యవధిలో దాదాపు రూ. 3,096 కోట్ల ఎన్‌పీఏలను బ్యాంకు రైటాఫ్‌ చేసింది.  
⇒  పూర్తి ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్య 3,000 తగ్గి, 1.01 లక్షలకు చేరింది. డిజిటల్, టెక్నాలజీపై పెట్టుబడులతో ఉత్పాదకత పెరగడం ఇందుకు కారణం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement