
అంతర్జాతీయంగా వ్యాపారాల్లో అనిశ్చితులు నెలకొనడం, కేవలం ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా కాదా అనే అంశంపై మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐటీ, ఫార్మాకు గట్టిగా దెబ్బ తగిలే అవకాశం ఉందని .. తయారీ రంగం, భారీ పెట్టుబడులు అవసరమయ్యే పరిశ్రమలు పాజిటివ్‌గా ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతగా బాగోలేని రంగాలను పక్కన పెట్టి, ఆకర్షణీయమైన రంగాలు లేదా థీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్లకు మించి రాబడులను రాబట్టాలనుకోవడం చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మెరుగ్గా రాణించే రంగాలను మాత్రమే అందిపుచ్చుకోవడమనేది పెద్ద సవాలుగా ఉంటుంది.
నియంత్రణ సంస్థలపరంగా నిబంధనల్లో మార్పులు, కొత్త ఉత్పత్తులు లేదా మార్కెట్ పరిణామాలు, అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు, వడ్డీ రేట్లలో మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కమోడిటీలు లేదా కరెన్సీల్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు మొదలైన వాటి వల్ల తాత్కాలికంగా కొన్ని రంగాలు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అయితే, సగటు రిటైల్ ఇన్వెస్టర్లకు పరిశ్రమవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితులతో పాటు కంపెనీకి మాత్రమే పరిమితమయ్యే ఇతరత్రా అంశాలను కూడా అధ్యయనం చేయడమనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫలితంగా సదరు రంగం ఇటీవలి పనితీరు చూసి కావచ్చు లేదా మీడియాలో హైప్ వల్ల కావచ్చు చాలా మటుకు రిటైల్ ఇన్వెస్టర్లు, సెక్టోరల్ లేదా థీమ్యాటిక్ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ
ఉంటారు.
బూమ్..ఢామ్..
సెక్టార్లు, థీమ్‌లు సాధారణంగా హెచ్చుతగ్గులు లోనవుతూ వలయాకృతిలో తిరుగాడుతుంటాయి. సదరు రంగం వాస్తవ పనితీరు కనిపించడానికి చాలా ముందే, అంచనాల ఆధారంగా స్టాక్ మార్కెట్లలో వాటి షేర్ల ధర పెరిగిపోతాయి. ఉదాహరణకు ఐటీ రంగం కొన్నాళ్లు బ్లాక్ బస్టర్ రాబడులు అందించాక (ఎన్‌ఎస్‌ఈ ఐటీ సూచీ: 1997–1999 మధ్య కాలంలో +173%, +193%, +493%), కొన్నాళ్లు భారీగా కరెక్షన్‌కి లోనయ్యింది (2000–2002 మధ్య కాలంలో –35%, –36%, –6%). ఇక ఫార్మా తీసుకుంటే నాలుగేళ్లు పటిష్టంగా ఉండగా (2012 నుంచి 2015 వరకు: +32%, +26%, +42%, +10%) తర్వాత వరుసగా నాలుగేళ్లు నెమ్మదించింది (–14%, –7%, –8%, –9%). అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం తలెత్తే వరకు ఇన్‌ఫ్రా, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఎన్‌బీఎఫ్‌సీల పరుగులు కొనసాగాయి. ఏదైతేనేం, సెక్టోరల్ పెట్టుబడులతో విజయం సాధించాలంటే ఇన్వెస్టరు కచ్చితత్వంతో ఎంట్రీ ఇవ్వడంతో పాటు కచ్చితమైన పాయింటులో వైదొలగడమూ ముఖ్యమే. ఇది చాలా కష్టతరంగా ఉంటుంది.
సెక్టోరల్ ఫండ్స్ పరిమితులు..
సెక్టోరల్ ఫండ్స్‌కి సంబంధించి కొన్ని రంగాలకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. సదరు థీమ్ కారణంగా ఆ రంగంలో ఉన్న దాదాపు అన్ని సంస్థలను ఫండ్ మేనేజర్లు ఎంచుకోవాల్సి రావచ్చు. దీనితో కేవలం అత్యధిక రాబడులను అందించే స్టాక్స్‌ను ఎంచుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఫలితంగా ఫండ్ పనితీరు పూర్తిగా పరిశ్రమ కదలికలపైనే ఆధారపడుతుంది తప్ప ఫండ్ మేనేజరు నైపుణ్యాలకు తావుండదు.
స్మార్ట్ విధానం ..
ఈ నేపథ్యంలో పరిశోధనల ఆధారంగా వివిధ రంగాలకు కేటాయింపులను ఎప్పటికప్పుడు సవరించే అనుభవజు్ఞలైన నిపుణుల సారథ్యంలోని డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోల్లో ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం అవుతుంది. సంప్రదాయ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే వారు లేదా తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు దాదాపు సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌తో మొదలుపెట్టడం మంచిది. అనుభవజ్ఞులైన లేదా దూకుడుగా ఉండే మదుపరులు కోర్–శాటిలైట్ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇందులో ఈక్విటీలకు సంబంధించి 75 శాతం లేదా అంతకు మించిన మొత్తాన్ని ఫ్లెక్సీ–క్యాప్ లేదా మల్టీ–క్యాప్ వ్యూహాల్లాంటివి పాటిస్తూ, నిర్వహణపరంగా మెరుగ్గా ఉన్న డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మిగతా 25 శాతాన్ని తమ నమ్మకానికి అనుగుణంగా థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్‌కి కేటాయించవచ్చు.
వినియోగం, ఆర్థికం లేదా తయారీకి సంబంధించిన థీమ్యాటిక్ ఫండ్స్ పలు పరిశ్రమలవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి కాబట్టి సెక్టోరల్ ఫండ్స్‌తో పోలిస్తే కాస్త తక్కువ రిసు్కలు ఉండొచ్చు. ఉదాహరణకు ‘కేపెక్స్’ థీమ్ ఫండ్‌లో యుటిలిటీలు, సిమెంటు, విద్యుత్, హౌసింగ్, ఆటో మొదలైన రంగాలు ఉండొచ్చు. దీనితో కేవలం ఒకే రంగంలో మొత్తం పెట్టుబడులంతా పెట్టడం వల్ల వచ్చే రిసు్కలు కాస్త తగ్గవచ్చు.

ఇదీ చదవండి: ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది?