అమెజాన్‌ కోటీశ్వరులు 4,152 మంది

Amazon‌ India Says That Amazon Has 4152 Billionaires - Sakshi

29 శాతం పెరిగిన కరోడ్‌పతి సెల్లర్స్‌ 

2020లో కొత్త వర్తకులు 1.5 లక్షలు 

వెల్లడించిన అమెజాన్‌ ఇండియా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఏడాది 1.5 లక్షల మంది వర్తకులు తమ వేదికపైకి కొత్తగా వచ్చారని ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఆదివారం వెల్లడించింది. కోవిడ్‌–19 ఉన్నప్పటికీ ఇక్కడి విక్రేతలు విజయవంతం అయ్యారని తెలిపింది. అమెజాన్‌ ఇండియా ఎస్‌ఎంబీ ఇంపాక్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం.. 70,000 పైచిలుకు వర్తకులు మొత్తం సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఉత్పత్తులను 15 అంతర్జాతీయ అమెజాన్‌ వెబ్‌సైట్ల ద్వారా ఎగుమతి చేశారు. ఉత్తర అమెరికా, ఈయూ, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా నుంచి భారత ఉత్పత్తులకు డిమాండ్‌ మూడు రెట్లు పెరిగింది. 2020లో రూ.1 కోటి, ఆపైన విక్రయాలు నమోదు చేసినవారు 4,152 మంది ఉన్నారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది కరోడ్‌పతి సెల్లర్స్‌ సంఖ్య 29% పెరిగింది.  

వేదికపై 20 కోట్లకుపైగా.. 
సహేలీ కార్యక్రమం ద్వారా మహిళా వర్తకుల వ్యాపారం 15 రెట్లు అధికమైంది. చేనేత, చేతివృత్తులవారు 2.8 రెట్లు తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. 55,000 స్థానిక స్టోర్స్‌ అమెజాన్‌తో చేతులు కలిపాయి. 10 లక్షల పైచిలుకు చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలతో కలిసి కంపెనీ పనిచేస్తోంది. వీరిలో విక్రేతలు, డెలివరీ, లాజిస్టిక్స్‌ భాగస్వాములు, కిరాణా వర్తకులు, డెవలపర్స్, కంటెంట్‌ క్రియేటర్స్, రచయితలు ఉన్నారు. ఆన్‌లైన్‌ సెల్లర్స్‌ 7 లక్షల పైమాటే. బీటూబీ మార్కెట్‌ప్లేస్‌లో 3.7 లక్షల మంది సెల్లర్స్‌ ఉన్నారు. వీరు జీఎస్‌టీ ఆధారిత 20 కోట్లకుపైగా ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నారు.  

రచయితలకూ ఆదాయం.. 
నవంబర్‌ 30 నాటికి కిండిల్‌ డైరెక్ట్‌ పబ్లిషింగ్‌ (కేడీపీ) వేదిక ద్వారా రచయితలు రూ.45 కోట్లకుపైగా ఆర్జించారు. కేడీపీ ఏటా రెండు రెట్లు పెరుగుతోంది. వందలాది మంది రచయితలు ఒక్కొక్కరు రూ.1 లక్షకుపైగా రాయల్టీ పొందారు. అలెక్సా కోసం భారత్‌కు చెందిన ఒక లక్ష మంది డెవలపర్లు పనిచేస్తున్నారు. వీరు అలెక్సా స్కిల్స్‌ కిట్‌ ద్వారా 30,000 పైగా నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. వేలాది స్మార్ట్‌ హోం ఉపకరణాలు అలెక్సాతో అనుసంధానించవచ్చు. అలెక్సాతో కూడిన 100కు పైచిలుకు స్మార్ట్‌ స్పీకర్స్, ఫిట్నెస్‌ ట్రాకర్స్, స్మార్ట్‌ టీవీలు ఉన్నాయి.  

ఇదీ అమెజాన్‌ లక్ష్యం.. 
సుమారు రూ.7,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. 2025 నాటికి ఒక కోటి చిన్న, మధ్యతరహా వ్యాపారులను ఆన్‌లైన్‌ వేదికపైకి తీసుకురావడం, రూ.74,000 కోట్లకు ఆన్‌లైన్‌ ఎగుమతులను చేర్చడం, అదనంగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top