
గ్లాస్ కంటైనర్ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ సంస్థ కొత్తగా అల్యూమినియం క్యాన్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త ప్లాంటుపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రెండు దశలుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.
ఇది తొలుత 95 కోట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 2028 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. దీన్ని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 160 కోట్లకు పెంచుకోనున్నట్లు సందీప్ తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 41%పెరిగి రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు చేరింది.
మెరిల్‌లో ఏడీఐఏ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ ఆథారిటీ(ఏడీఐఏ), భారత్‌కు చెందిన మెడికల్ డివైజెస్ తయారీ సంస్థ మైక్రో లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(మెరిల్)లో 200 మిలియన్ డాలర్ల(రూ.1,670 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో మెరిల్‌లో ఏడీఐఏకు 3% వాటా లభించనుంది.
తద్వారా మెరిల్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,859 కోట్లు)చేరుతుందని అంచనా. పెట్టుబడి నిధులను వ్యాపార విస్తరణ, పరిశోధన–అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు వినియోగించుకుంటామని మెరిల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ తెలిపారు. గుజరాత్‌లోని వాపి కేంద్రంగా పనిచేసే మెరిల్ సంస్థ... గుండె సంబంధిత పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు వంటి వైద్య పరికరాలు తయారు చేస్తుంది.