
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళంగా.. పారదర్శకంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం 'ఆదాయపు పన్ను బిల్లు - 2025'ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ బిల్లుపై పరిశీలనలు.. సూచనలతో కూడిన 4,500 పేజీల నివేదికను ప్యానెల్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది.
ఇప్పుడు, ఆగస్టు 11న జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే దశాబ్దాల తర్వాత భారతదేశ పన్ను వ్యవస్థలో అతిపెద్ద మార్పు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆదాయపు పన్ను బిల్లులో 5 ప్రధాన మార్పులు
అధ్యాయాల సంఖ్య: ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి, ఇవి బహుళ సవరణల కారణంగా చాలా క్లిష్టంగా మారాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.
పదాల సంఖ్య: పాత చట్టంలో 4.1 లక్షల పదాలు ఉండగా, కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025లో 2.6 లక్షల పదాలు మాత్రమే ఉన్నాయి. ఈ చట్టాన్ని పన్ను సలహాదారులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగానే పదాల సంఖ్యను చాలా తగ్గించడం జరిగింది.
ఇదీ చదవండి: ‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానం
సూత్రాలు & పట్టికలు: కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
వివరణ మరింత సులభం: స్థిరత్వాన్ని కొనసాగించడానికి, పన్ను విధించదగిన ఆదాయం, పన్ను స్లాబ్‌లు, రాయితీలు వంటి పాత పన్ను సూత్రాలను బిల్లులో అలాగే ఉంచారు. అయితే, వాటి ప్రదర్శన, వివరణ మునుపటి కంటే స్పష్టంగా.. సులభంగా చేసారు.
అవసరమైన నిబంధనలు: 1961 చట్టంలో ఇప్పుడు వర్తించని అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక, పన్ను నిర్మాణం పరంగా అవసరమైనవి మాత్రమే చట్టంలో మిగిలి ఉండేలా కొత్త బిల్లులో అలాంటి నిబంధనలను తొలగించారు.