
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబైలో 1బీహెచ్‌కే రెంట్ ఏకంగా రూ.42000 అని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ముంబైలోని గోరేగావ్ వెస్ట్, దాని సమీప ప్రాంతాలలో 1బీహెచ్‌కే కోసం వెతుకుతున్నప్పుడు, అద్దెలు నన్ను ఆశ్చర్యపరిచాయని రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అవి కొత్త భవనాలు కాదు, మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. రెంట్ మాత్రం రూ. 42000 నుంచి ప్రారంభమవుతోంది. అద్దె ఇంటి కోసం నా బడ్జెట్ రూ. 35000 నుంచి రూ. 38000 అని చెప్పినప్పుడు బ్రోకర్ నవ్వాడు అని కూడా యూజర్ తన పోస్టులో పేర్కొన్నాడు.

గతంలో నేను ముంబైలోనే నివసించాను. అప్పటికి, ఇప్పటికి అద్దెలు చాలా పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. అద్దె పెరిగినా.. మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తక్కువ ధరలో అద్దె ఇల్లు కావాలంటే.. మలాడ్ వెస్ట్ సమీప ప్రాంతాల్లో చూడమని కొందరు సలహా ఇచ్చారు. బ్రోకర్లను నమ్మవద్దని ఇంకొందరు సూచించారు.