దాపరికం ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

దాపరికం ఎందుకు?

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

మొత్తం వివరాలు వెల్లడించని సింగరేణి యాజమాన్యం

ఏడాది వ్యవధిలో మూడో వంతుకు పడిపోయిన లాభాలు

సంస్థ ఆర్థిక పరిస్థితిపై కార్మికలోకంలో ఆందోళన

2020–21 నుంచి సింగరేణి లాభాలు(రూ. కోట్లలో..)

లాభాల్లో వాటా

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ రంగ కార్పొరేట్‌ సంస్థల్లో పనితీరు, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సింగరేణి సంస్థ ఘనమైన రికార్డు కలిగి ఉంది. నవరత్న కంపెనీలతో పోటీపడే స్థాయి ఉండటంతో మినీరత్నా హోదా ఇవ్వాలనే డిమాండ్‌ కూడా కొంతకాలం సాగింది. 90వ దశకంలో విపరీతమైన సమ్మెలు జరిగినా, 2020–21 కరోనా సంక్షోభ సమయంలోనూ సంస్థ బలంగా నిలబడింది. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31 లేదా కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్‌ మొదటి భాగంలోనే వార్షిక ఫలితాలు వెల్లడించడం సంస్థలో రివాజుగా మారింది. వందేళ్లపాటు కొనసాగిన ఈ ఆనవాయితీ 2025–26 ఆర్థిక సంవత్సరంలో గాడి తప్పింది.

ఆలస్యం.. ఏకపక్షం

2025–26 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ ఎంత? అందులో బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చింది ఎంత? థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌, అప్మెల్‌ వాటా ఎంత అనే విషయాలను గడిచిన ఆరు నెలలుగా సంస్థ ప్రకటించలేదు. దసరా పండగ వారం పది రోజులు ఉండగా, కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం హడావుడిగా సింగరేణి నికర లాభం రూ.1,754 కోట్లుగా పేర్కొంది. అందులో 34 శాతం అంటే రూ.596 కోట్లను లాభాల బోనస్‌గా ఇస్తామని ఏకపక్షంగా ప్రకటించడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

అనుమానాలు.. ఆందోళనలు

2024–25లో రికార్డు స్థాయిలో రూ.6,393 కోట్ల నికర లాభాలను ఆర్జించిన సంస్థ, ఆ మరుసటి ఏడాది కేవలం రూ.1,754 కోట్లకు పరిమితమైంది. ఒక్క ఆర్థిక సంవత్సరం వ్యవధిలోనే మూడో వంతుకు లాభాలు పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నికర లాభాలు కేవలం రూ.1,754 కోట్లేనా లేక గతంలో చేసినట్టుగా భవిష్యత్‌ అవసరాల కోసం లాభాల్లో కొంత వాటా పక్కన పెట్టారా ? పెడితే ఎంత పక్కన పెట్టారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు ఎంత కట్టారు? రుణాలు ఎంత మేరకు చెల్లించారు? వంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఆర్థిక ఫలితాల వెల్లడిలో పారదర్శకత లోపించడం, లాభాల ప్రకటన విషయంలో ఆలస్యం, దాపరికం కనిపించడం వంటి వ్యవహారాలు సింగరేణి మేనేజ్‌మెంట్‌, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు అవకాశం కల్పిస్తున్నాయి.

2025–26 ఆర్థిక సంవత్సరం ఫలితాల వెల్లడిలో ఆలస్యం

ఆర్థిక సంవత్సరం నికర లాభం

(పన్నులకు ముందు) (పన్నుల తర్వాత)

2020–21 777 441

2021–22 1,684 1,193

2022–23 6,507 4,791

2023–24 6,443 4,701

2024–25 8,660 6,393

2025–26 ––––– 1,754

గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు లేకపోవడం, యాజమాన్య లోపాల కారణంగా 1996 నాటికి సింగరేణి దివాళ దారిలో ప్రయాణించింది. అప్పులపై మారటోరియం ప్రకటించడం, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంతో 2000 నాటికే అప్పులన్నీ తీర్చి సింగరేణి లాభాల బాటలోకి వచ్చింది. దీంతో ఆర్థిక సంవత్సరం నికర లాభాల్లో కార్మికులకు 10 శాతాన్ని దసరా పండుగ సందర్భంగా వాటా ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతోంది. 10 శాతంతో మొదలైన లాభాల వాటా 2024–25 ఆర్థిక సంవత్సరానికి 34 శాతానికి చేరుకుంది. అప్పటి ఫలితాల్లో నికర లాభం పన్నులు లేకుండా రూ.8,660 కోట్లుగా సంస్థ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాక లాభం రూ.6,393 కోట్లుగా వెల్లడించింది. ఇందులో సంస్థ విస్తరణ, భవిష్యత్‌ అవసరాల కోసం రూ.4,034 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. మిగిలిన రూ.2,360 కోట్లలో 34 శాతం అంటే రూ.819 కోట్లను కార్మికులకు బోనస్‌గా ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement