శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. భద్రాచలానికి చెందిన చారుగుళ్ల గిరిధర్‌ కృష్ణ రూ.1,02,121, రాజమండ్రి వెంకటనగరానికి చెందిన గుండా నాగేంద్ర వరప్రసాద్‌ రూ. లక్ష ఆలయ అధికారులకు అందించారు. వారు దాతలకు రశీదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

భారజల కర్మాగారం

జీఎంగా ఓజా

అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం జీఎంగా ధర్మేష్‌ చంద్ర ఓజా బుధవారం కర్మాగారం అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జీఎంగా పనిచేసిన ఘంటసాల శ్రీనివాసరావు భారజల బోర్డు(ముంబై) అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఓజా గతంలో మణుగూరు భారజల కర్మాగారంలో సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా, డీజీఎంగా పనిచేశారు. తాజాగా బదిలీపై జీఎంగా నియమితులయ్యారు. నూతన జీఎం ఓజా, పదోన్నతిపై వెళ్తున్న శ్రీనివాసరావును కర్మాగారం అధికారులు, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు బాల, రాజేష్‌ సన్మానించారు.

అటవీ సిబ్బందికి శిక్షణ

చుంచుపల్లి: అటవీ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ లక్ష్యంగా అటవీ బ్లాకుల సరిహద్దుల సర్వే, నిర్ధారణపై జిల్లా అటవీ శాఖ సిబ్బందికి బుధవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. కొత్తగూడెంలోని వనవిహార్‌ జిల్లా అటవీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి సర్కిల్‌ సీసీఎఫ్‌ డాక్టర్‌ భీమా నాయక్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు. సరిహద్దుల నిర్ధారణలో కచ్చితత్వం పాటిస్తూ, అటవీ భూముల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, ఎఫ్‌డీఓలు కృష్ణ ప్రసాద్‌, బాబు, జిల్లా అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

16న అశ్వారావుపేట బార్‌ డ్రా

కొత్తగూడెంఅర్బన్‌: అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 2బీ బార్‌కు ఈ నెల 16న డ్రా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ అంకిత్‌ చేతుల మీదుగా డ్రా కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 357 బార్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారులకు అందరికీ ఎంట్రీ పాస్‌లను జారీ చేస్తామని, పాస్‌లున్న వారినే డ్రా కార్యక్రమం హాల్‌లోకి అనుమతిస్తామని వివరించారు.

రేపు లాభాల వాటా

చెల్లింపు

రుద్రంపూర్‌: సింగరేణి కార్మికులకు ఈ నెల 16న యాజమాన్యం లాభాల వాటా చెల్లించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 1,754 కోట్ల లాభంలో 34శాతం వాటా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత మంగళవారం ప్రకటించిన విషయం విదితమే. కార్మికులకు మస్టర్ల ఆధారంగా వాటా ధనం చెల్లించనున్నారు. అండర్‌ గ్రౌండ్‌లో పనిచేసే కార్మికులకు మస్టరుకు రూ.602.26 చొప్పున, ఎస్టీపీపీ, సర్ఫేస్‌, పీహెచ్‌పీలలో పనిచేసే కార్మికులకు మస్టర్‌కు రూ.476.78 చొప్పున, ఇతర డిపార్ట్‌మెంట్లలో పనిచేసే వారికి రూ.440.11 చొప్పున లెక్కించి చెల్లించనున్నారు. ఈ మేరకు ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య బుధవారం రాత్రి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement