అశ్వారావుపేటరూరల్: రామన్నగూడెం భూముల రీ సర్వే మరో పది రోజుల్లో పూర్తి చేయాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం మండలంలోని రామన్నగూడెం రెవెన్యూ పరిధిలోని మూడు సర్వే నంబర్లలో చేపట్టిన భూముల రీ సర్వే, అశ్వారావుపేటలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. సర్వే నంబరు 39 పరిధిలోని భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 181 మంది రైతుల వద్ద ఉన్న పాత పట్టాలు, పాస్బుక్లు, ఇతర భూ రికార్డులను పరిశీలించి, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి వాస్తవాలను నిర్ధారించాలని అధికారులకు చెప్పారు. యంగ్ ఇండియా పాఠశాల భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. సర్పంచ్ మడకం నాగేశ్వరరావు, తహసీల్దార్ దాసరి కిశోర్, ఈజీఎస్ ఏపీఓ రామచంద్రరావు, సర్వేయర్లు పాల్గొన్నారు.
నిర్దేశిత గడువులోగా
సర్వే పనులు పూర్తి చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో చేపట్టిన భూ సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి టెలీకాన్ఫ్రెన్స్ ద్వారా సంబంధిత మండలాల అధికారులతో పలు విషయాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోదాముల గుర్తింపుపై కూడా కలెక్టర్ సమీక్ష జరిపారు.
కలెక్టర్ అంకిత్


