చర్ల: తాలిపేరు నదిలో మునిగి బాలుడి మృతి చెందిన ఘటన ఆ కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చర్ల గొల్లగట్ట ప్రాంతానికి చెందిన ఐదుగురు భవానీ మాలధారులు బుధవారం తేగడ సమీపంలో తాలిపేరు నదిలో స్నానాలకు వెళ్లారు. వారితోపాటు అదే ప్రాంతానికి చెందిన దగ్గుపల్లి వీరయ్య–లక్ష్మి దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు (16) కూడా స్నానానికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడున్నవారు సమాచారం అందించడంతో ఎస్సై నర్సిరెడ్డి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాటు పడవులు, జాలర్ల సహాయంతో నదిలో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆశలన్నీ ఆవిరి..
వీరయ్య దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారు. ఇంటర్ చదువుతున్న కుమారుడు వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


