అశ్వారావుపేటరూరల్: అత్యవసర వేళ క్షతగ్రాతులను ఆస్పత్రులకు తరలించి ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్ వాహనానికి సుస్తీ చేసింది. దీంతో తల్లీబిడ్డలను ఆస్పత్రి నుంచి ఇళ్లకు చేర్చే 102 వాహనం సాయం చేసింది. అశ్వారావుపేట 108 వాహనం మరమ్మతులకు గురి కావడంతో మంగళవారం ఉదయం సిబ్బంది భద్రాచలం తరలించి వాహనానికి రిపేరు చేయించారు. తిరిగి అశ్వారావుపేటకు వస్తున్న క్రమంలో మండలంలోని కుడుములపాడు వద్ద మంగళవారం రాత్రి మరోసారి మరమ్మతులకు గురై ఆగిపోయింది. మార్గమధ్యలోనే ఆగిపోయిన 108 అంబులెన్స్ వాహనాన్ని 102 వాహనం సాయంతో రాత్రి 11గంటలకు అశ్వారావుపేటకు తీసుకొచ్చారు.


