సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్) కార్యక్రమంలో గందరోళం నెలకొంది. ప్రజావాణి కలెక్టర్ అంకిత్ పాల్గొనలేదు. దీంతో అధికారులు ఎవరికివారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజావాణి ఫిర్యాదుల కంటే ముచ్చట్లపైనే దృష్టి నిలపారనే విమర్శలు వచ్చాయి. పలువురు హాల్‌లో ఉండకుండా క్యాంటీన్‌కు వెళ్లిపోయి బాతాఖానీ కొట్టారు. అధికారుల తీరుతో సమస్యలు విన్నవించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు విసిగిపోయారు.
సమస్యలు పరిష్కరించాలి
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మావతి, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, హౌసింగ్ పీడీ సవేరామ్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ పాత కమిటీని రద్దుచేసి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్ దరఖాస్తు అందజేశారు. సుజాతనగర్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు రైతులు విన్నవించారు.
ఆర్డీఓ కార్యాలయంలో...
కొత్తగూడెం ఆర్డీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆరు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అశ్వారావుపేట నుంచి 3, చండ్రుగొండ 1, దమ్మపేట మండలం నుంచి 2 దరఖాస్తులు భూసమస్యలపై వచ్చాయి. కొత్తగూడెం ఆర్డీఓ మధు దరఖాస్తులను స్వీకరించి ఆయా తహసీల్దార్లకు పరిష్కారం కోసం ఎండార్స్ చేశారు.


