న్యూస్‌రీల్
27 రోజుల్లో 52 మంది చిన్నారులకు..
ప్రభుత్వాస్పత్రిలో లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్ సేవలు
తల్లి నేరుగా పాలివ్వలేకున్నా సేకరించి ఇస్తున్న సిబ్బంది
ఆగస్టులో ఎస్‌ఎన్‌సీయూలోని 52 మంది చిన్నారులకు అందజేత
జిల్లాలో తొలిసారిగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు
తల్లిపాలే బలం
దగ్గరుండి చెబుతున్నాం
ఎల్‌ఎంయూతో
మంగళవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
భద్రాచలంఅర్బన్: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు, తక్కువ బరువుతో జన్మించినవారు, అనారోగ్యంతో ఎస్‌ఎన్‌సీయూలో చేరిన పసికందులకు ఒక్కోసారి తల్లి నేరుగా పాలు పట్టించే పరిస్థితి ఉండదు. ప్రసవం తర్వాత తల్లి ఆరోగ్యం సహకరించకపోయినా బిడ్డకు అమ్మపాలు అందవు. అలాంటి చిన్నారులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్ (ఎల్‌ఎంయూ) సేవలు అందిస్తోంది. తల్లి నుంచి పాలను సేకరించి బిడ్డకు అందించడంతోపాటు పాలు పట్టించడంలో ఇబ్బందిపడే బాలింతలకు సిబ్బంది దగ్గరుండి సహకరిస్తున్నారు. గర్భిణులకు ముందుగానే తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఎల్‌ఎంయూనూ జిల్లాలో తొలిసారిగా భద్రాచలంలోనే ఏర్పాటు చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా–శిశు ఆరోగ్య కేంద్రంలో ఎల్‌ఎంయూ సేవలు 2022లోనే ప్రారంభమయ్యాయి.
పుట్టిన 300 మందిలో 292 మందికి..
ఆగస్టు నెలలో ఏరియా ఆస్పత్రిలో మొత్తం 300 ప్రసవాలు జరిగాయి. ఇందులో 176 సిజేరియన్ 124 సాధారణ ప్రసవాలు. ఆ నెలలో జన్మించిన 300 మంది చిన్నారుల్లో 292 మందికి తల్లిపాలు అందేలా సిబ్బంది సహకరించారు. సిజేరియన్ ద్వారా జన్మించిన వారిలో 172 మంది, సాధారణ ప్రసవాల్లో 120 మంది చిన్నారులకు తల్లిపాలు అందాయి. ప్రసవం తర్వాత పాలు రావడం లేదని ఆందోళన చెందే తల్లులు, బిడ్డకు ఎలా పాలు పట్టించాలో తెలియక ఇబ్బందిపడే వారికి ఎల్‌ఎంయూ సిబ్బంది కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆగస్టులో 77 మంది గర్భిణులు, 120 మంది బాలింతలు.. మొత్తం 197 మందికి అవగాహన కల్పించారు.
బ్రెస్ట్ పంప్ ద్వారా పాలను సేకరిస్తున్న బాలింత
ఏరియా ఆస్పత్రిలో గత ఆగస్టు 5న ఎల్‌ఎంయూ సేవలు ప్రారంభించారు. ఆ నెలలో 2.22 లీటర్ల తల్లిపాలను సేకరించి ఎస్‌ఎన్‌సీయూలోని 52 మంది చిన్నారులకు అందించారు. తల్లి నేరుగా పాలు పట్టించలేని పరిస్థితుల్లో ఆమె నుంచి పాలను సేకరించి బిడ్డకు అందిస్తున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న చిన్నారులకు తల్లిపాలు అందించాల్సి వచ్చినప్పుడు ఎల్‌ఎంయూ సిబ్బంది ఆ బాధ్యత తీసుకుంటున్నారు.
తల్లి నేరుగా పాలు పట్టించలేని సమయంలో ఆమె నుంచి పాలను సేకరించి బిడ్డకు అందిస్తున్నాం. ఎస్‌ఎన్‌సీయూలోని చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. గర్భిణులు, బాలింతలకు కూడా తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తున్నాం.
– క్రాపా విజయ్, చిన్నపిల్లల వైద్యుడు
ప్రసవం తర్వాత కొందరు తల్లులు బిడ్డకు పాలు పట్టించేందుకు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి దగ్గరుండి ఎలా పాలు పట్టించాలో చెబుతున్నాం. అవసరమైన సందర్భాల్లో పాలను సేకరించే విధానాన్ని కూడా వివరిస్తున్నాం.
– రమ్యకృష్ణ, స్టాఫ్‌నర్స్


