అర్జీలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

Oct 13 2026 12:17 AM | Updated on Oct 13 2026 12:17 AM

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

దమ్మపేట/ములకలపల్లి: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం దమ్మపేట మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ములకలపల్లి మండలం జగన్నాథఫురం రైతువేదికలో డీఆర్‌డీఓ విద్యాచందనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. రైతునేస్తం కార్యక్రమాలు, ఫారెస్ట్‌, రెవెన్యూ సంయుక్త సర్వేలు, భూ రీసర్వే పురోగతి, ప్రజావాణికి ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరుకావడంపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సరఫరా, చెరువుల నీటి నిల్వలు, వ్యవసాయ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. మండలస్థాయిలో ప్రజావాణి కార్యక్రమంపై గ్రామాల్లో టామ్‌టామ్‌ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, యువత సహకారంతో సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత రబీ సీజన్‌తో పోలిస్తే ఈయేడు సుమారు 50 వేల ఎకరాల్లో వరిసాగు తగ్గిందని, తగ్గిన ప్రదేశంలో పప్పు దినుసులు, అపరాలు సాగు చేయాలని అన్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం రెండు మీటర్లమేర తగ్గిన క్రమంలో తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. వీబీ జీరామ్‌జీ పథకంలో ప్రతీ గ్రామంలో పనులను గుర్తించాలన్నారు. తహసీల్దార్లు మద్దినేని మురళి, స్వాతిబిందు, ఎంపీడీఓలు రవీంద్రా రెడ్డి, సత్యనారాయణ, సీపీఓ సునీత, డీఏఓ బాబూరావు, కిషోర్‌, అలీంఖాన్‌, రమేష్‌, సర్పంచ్‌ కుంజా వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ

ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): గోదావరి పుష్కరాలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దేవా దాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావుతో కలిసి సోమవారం హైదరాబాద్‌ నుంచి గోదావరి నదీ తీర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ అంకిత్‌ ఐడీఓసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భద్రాచలంలో పుష్కర ఘాట్లకు, వైకుంఠధామానికి ప్రస్తుతం ఒకే మార్గం ఉందని, రద్దీ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వైకుంఠధామానికి ప్రత్యేక మార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సునీత, ఇరిగేషన్‌ ఈఈ సయ్యద్‌ అహ్మద్‌ జానీ, పంచాయతీరాజ్‌ ఈఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement