న్యూస్‌రీల్
ప్రత్యేక సవరణకు ముందు జాబితాలో 9,96,198 మంది ఓటర్లు
ముసాయిదా జాబితాలో 8,63,413కు తగ్గిన సంఖ్య
వీరిలో 2,40,438 మందికి నోటీసులు జారీ
అందులో ఆధారాలు సమర్పించినవారు 1,78,577 మంది
ఇంకా 61,861 మంది ఓటర్లపై కొనసాగుతున్న విచారణ
నవంబరు 9వ తేదీన తుది జాబితా వెల్లడి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో వచ్చిన దరఖాస్తులు
జిల్లాలో ఓటర్ల జాబితాలో భారీగా కోత
సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
చుంచుపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో జిల్లాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,32,785 మంది ఓటర్ల పేర్లు తొలగించనున్నారు. ప్రత్యేక సవరణకు ముందు జిల్లాలో 9,96,198 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 8,63,413కు తగ్గింది. దాదాపు 13.33 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గినట్లయింది. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే కొత్తగూడెంలో అత్యధికంగా 34,446 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇల్లెందు నియోజకవర్గంలో 33,351, పినపాకలో 29,664, భద్రాచలంలో 19,873, అశ్వారావుపేటలో 15,451 పేర్లు తొలగించారు.. మొత్తం తొలగింపుల్లో కొత్తగూడెం, ఇల్లెందు రెండు నియోజకవర్గాల వాటానే 67,797గా ఉంది. పేర్ల తొలగించిన ఓటర్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం 78,253 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారిగా నమోదయ్యారు. మరణించినవారు 31,187 మంది కాగా, ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనవారు 14,305 మంది ఉన్నారు. అందుబాటులో లేకపోవడం లేదా సంప్రదించలేకపోవడం కారణంగా 8,733 మంది, ఇతర కారణాలతో 307 మంది పేర్లు తొలగించారు. శాశ్వత వలసల కారణంగా తొలగించిన పేర్లు మొత్తం తొలగింపుల్లో సుమారు 59 శాతం ఉన్నాయి. మరణించిన వారి పేర్లు సుమారు 23.5 శాతంగా ఉన్నాయి.
నియోజకవర్గం రిమార్క్ లేనివి నోటీసులు జారీ విచారణ పూర్తి మిగిలినవి
పినపాక 1,18,722 56,091 37,316 18,775
ఇల్లెందు 1,51,536 43,317 35,695 7,622
కొత్తగూడెం 1,45,460 70,174 51,435 18,739
అశ్వారావుపేట 1,08,473 36,354 26,138 10,216
భద్రాచలం 99,128 34,502 27,993 6,509
మొత్తం 6,23,319 2,40,438 1,78,577 61,861
నియోజకవర్గం ఫారం–6 ఫారం–7 ఫారం–8 మొత్తం
పినపాక 1,279 38 2,335 3,652
ఇల్లెందు 1,053 15 1,924 2,992
కొత్తగూడెం 1,780 45 4,243 6,068
అశ్వారావుపేట 1,008 35 1,148 2,191
భద్రాచలం 1,230 188 1,271 2,689
మొత్తం 6,350 321 10,921 17,592


