భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
గోదావరి మాతకు హారతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గోదావరి మాతకు ఆదివారం నదీ హారతి నిర్వహించారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. గణపతి పూజ, గోదావరి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం సీతారామ చంద్ర స్వామికి 12 సార్లు, గోదావరి మాతకు 21 సార్లు హారతి ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్, రవికుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, తేజశర్మ, సుబ్రహ్మణ్యంశర్మ, తిరుపతిరావు, శివ తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10గంటలకు హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఐటీడీఏలో గిరిజన దర్బార్,
సబ్ కలెక్టరేట్‌లో ప్రజావాణి
భద్రాచలంఅర్బన్: నేడు ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సూచించారు. ఈ మేరకు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గిరిజనులు, ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అర్జీల రూపంలో అందజేయాలని కోరారు.
స్వీయ క్రమశిక్షణ
ఉండాలి
టేకులపల్లిరూరల్: పోలీసులు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని ఇల్లెందు డీఎస్పీ యు.వెంకన్న బాబు సూచించారు. ఆదివారం బోడు పోలీస్ స్టేషన్‌లో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, స్టేషన్ పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణ పరిశీలించారు. పోలీస్ కిట్లు పరిశీలించి, సిబ్బందితో పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని అన్నారు. పోలీసులు 5ఎస్ విధానాన్ని పాటించాలని, వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వహించాలని సూచించారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ రాజమౌళి పాల్గొన్నారు.


