నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

● తొమ్మిది అలంకారాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు ● దసరా వరకు భద్రగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ

● తొమ్మిది అలంకారాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు ● దసరా వరకు భద్రగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. సోమవారం నుంచి రామాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీ తాయారు అమ్మవారిని తొమ్మిది రోజులపాటు విభిన్న రూపాల్లో అలంకరించనున్నారు. రోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు 12న ఆదిలక్ష్మిగా, 13న సంతానలక్ష్మిగా, 14న గజలక్ష్మిగా, 15న ధన లక్ష్మిగా, 16న ధాన్యలక్ష్మిగా, 17న విజయలక్ష్మిగా, 18న ఐశ్వర్యలక్ష్మిగా, 19న వీరలక్ష్మిగా, 20న మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మారుతి సదనంలో రామాయణ పారాయణం

శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు సుమారు 108 మంది పారాయణదారులతో శ్రీరామాయణ పారాయణోత్సవాలు నిర్వహించనున్నారు. రామాలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తానీషా కల్యాణ మండపం వెనుకనున్న మారుతి సదనంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పారాయణదారులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. 13 నుంచి 21వ తేదీ వరకు రోజూ సంకీర్తన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అభివృద్ధి పనుల కారణంగా ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే తిరువీధి సేవలను రద్దు చేసినట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి.

21న విజయదశమి వేడుకలు

శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా ఈ నెల 21న విజయదశమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహా పట్టాభిషేకం, దసరా మండపంలో శమీపూజ, ఆయుధపూజ, విజయయాత్ర, శ్రీరామ లీలా మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement