అనుమతి రాగానే చెల్లిస్తాం
● జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగి పది నెలలు ● సర్పంచ్, వార్డు అభ్యర్థులు చెల్లించిన డిపాజిట్ రూ.35 లక్షలు ● పోటీ చేసిన వారికి తిరిగి సొమ్ము చెల్లించని ప్రభుత్వం
ఇల్లెందురూరల్: జిల్లాలో గ్రామపంచాయతీల ఎన్నికలు నిర్వహించి పది నెలలు గడుస్తోంది. పలువురు విజయం సాధించగా, కొందరు స్వల్ప మెజారిటీతో ఓటమి చెందారు. ఇంతవరకు బాగానే ఉన్నా నామినేషన్ సమయంలో వారు చెల్లించిన ధరావత్తు సొమ్మును తిరిగి చెల్లించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
చెల్లించిన ధరావత్తు రూ.35 లక్షలు
జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలు, ఎన్నికలు జరగని స్థానాలు పోను 428 జీపీలలో సర్పంచ్ స్థానాలకు 1,317 మంది అభ్యర్థులు, 3,291 వార్డు సభ్యుల స్థానాలకు 4,189 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ధరావత్తు సొమ్ము సర్పంచ్ స్థానానికి జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000, వార్డుకు జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 చొప్పున చెల్లించారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో జమ అయిన ధరావత్తు మొత్తం సుమారు రూ.35 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా.
పది నెలలు గడుస్తున్నా..
గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచి పోలైన ఓట్లలో కనీసం ఆరోవంతు ఓట్లు వచ్చిన అభ్యర్థులకు ధరావత్తు మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆరో వంతు ఓట్లు కూడా సాధించని వారికి డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించరు. జిల్లాలో 2025 డిసెంబర్ 12, 14, 16 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్య పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 17వ తేదీతో ఎన్నికలు నిర్వహించి పది నెలలు పూర్తవుతుంది. ఫలితాల తరువాత డిపాజిట్లు కోల్పోయిన వారిని మినహాయించుకుని మిగతా వారందరికీ ధరావత్తు సొమ్ము తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ డబ్బును అధికారులు తమ వద్దే ఉంచుకుని ఎన్నికల్లో పోటీ చేసిన వారికి రిక్తహస్తం చూపిస్తున్నారు.
ఆ సొమ్ము ఏమైనట్లు..?
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతీ మండలానికి రూ.5 లక్షలు ఖర్చు నిమిత్తం ఇవ్వాలి. కానీ వాటిని ఇవ్వకపోవడంతో ధరావత్తు సొమ్ము విని యిగించినట్లు అధికారులు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ధరావత్తు సొమ్ము మండల పరిషత్ ఖాతాలో భద్రంగా ఉందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు శ్రద్ధ చూపిస్తే పోటీ చేసి డిపాజిట్ దక్కించుకున్న అభ్యర్థులు ధరావత్తు సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ధరావత్తు సొమ్ము నిబంధనలకు లోబడి తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం, ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే చెల్లిస్తాం. – అనూష, జిల్లా పంచాయతీ అధికారి


