రాకేశ్‌రెడ్డికి షాక్!
నాయకులు, కార్యకర్తలను లెక్క చేయని ఎమ్మెల్సీ ‘ఉంటే ఉండండి, పోతే పోండి’ అంటూ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా భావిస్తున్న రాకేశ్‌రెడ్డికి గుచ్చుకుంటున్న గులాబీ ముల్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వ్యవహార శైలి మొదటికే మోసం తెచ్చేలా ఉందనే గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అశ్వారావుపేట నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ ఆయనకు ప్రాధాన్యత దక్కలేదు. ఆహ్వాన పత్రికలో పేరు లేదు, సకాలంలో వేదికపైకి పిలవలేదు. ఇవే విషయాలను మీటింగ్‌లో ఆయన ప్రస్తావించారు. దీనిపై రవీందర్‌రావు స్పందిస్తూ ఒక దశలో సహనం కోల్పోయి ‘పార్టీలో ఉంటే ఉండు... పోతే పో..’అన్నారు. కనీసం తన సీనియారిటీ గుర్తించకుండా అవమానిస్తున్నారంటూ తాటి వెంకటేశ్వర్లు వెంటనే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.
కొత్తగూడెం సమావేశంలోనూ..
ఓటర్ల సవరణ కార్యక్రమంపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు జూన్ రెండో వారంలో కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను ఉద్దేశించి ‘పద్ధతి మార్చుకోవాలి.. లేకుంటే బాగోదు’అంటూ పదే పదే రవీందర్‌రావు వ్యాఖ్యానించారు. దీంతో వనమా వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా రవీందర్‌రావు సంయమనం పాటించకుండా... పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని, పార్టీలో ఉండే వాళ్లు ఉండవచ్చని, పోయేవాళ్లు పోవచ్చని, తాను ఎవరికీ భయపడనని, హెచ్చరిస్తున్నట్టుగా ఎదురుదాడికి దిగారు. దీంతో వివాదం మరింతగా ముదిరింది. పదుల సంఖ్యలో కార్యకర్తలు వేదిక మీదకు దూసుకొచ్చారు. కుర్చీలు విరగ్గొట్టారు. దీంతో ‘సర్’ అవగాహన సదస్సు కాస్తా రసాభాసగా మారింది.
ప్రత్యక్షంపై పరోక్ష పెత్తనం
సర్పంచ్ నుంచి మంత్రి వరకు వివిధ హోదాల్లో వనమా వెంకటేశ్వరరావు పని చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందే 1999లో బూర్గంపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర తాటి వెంకటేశ్వర్లుకు ఉంది. పైగా వీరిద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి విషయానికి వస్తే దాదాపుగా పరోక్ష పద్ధతిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జిల్లా బాధ్యతలు చూస్తున్న మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం పరోక్ష పద్ధతిలోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజాబలంతో గెలిచిన నేతల సీనియారిటీ , కేడర్ బలాన్ని పరోక్ష పద్ధతిలో చట్టసభల్లో అడుగు పెట్టిన నేతలు గుర్తించడం లేదనే చర్చ ఇప్పుడు పార్టీ కేడర్‌లో మొదలైంది. పైగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాటి, బీసీ సామాజికవర్గానికి చెందిన వనమాలపై వ్యాఖ్యలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన కనీస బాధ్యత తక్కెళ్లపల్లిపై ఉంటుందనే గళాలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పోల్చితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి బలమైన పునాది లేదు. 2018–2023 మధ్యలో వచ్చిన నేతలే పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇలాంటి నేతలను జాగ్రత్తగా ఒక్కతాటిపైకి తెచ్చి, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తక్కెళ్లపల్లిపై ఉంది. మరోవైపు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కారు గుర్తుపై పోటీ చేసేందుకు రాకేశ్‌రెడ్డి సిద్ధమయ్యారు. జాబ్‌మేళాలు, శిక్షణ తరగతులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ, కీలక సమయంలో రవీందర్‌రావు వ్యవహార శైలితో పార్టీకి తద్వారా రాకేశ్‌రెడ్డికి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరినీ కలుపుకుని పోవాల్సిన పార్టీ బాధ్యులే ‘ఉంటే ఉండు, పోతే పో’ అంటూ సీనియర్ లీడర్లకు వార్నింగ్‌లు ఇవ్వడమనేది రివర్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీకే ఒక హెచ్చరిక లాంటిదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి తీరుతో గులాబీ శ్రేణుల ఆందోళన


