కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చారు. కల్యాణమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

భక్తిశ్రద్ధలతో

రామకోటి నిమజ్జనం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి భక్తులు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను బుధవారం గోదావరిలో నిమజ్జనం చేశారు. గతంలో నెలకోసారి రామకోటి పుస్తకాలను నిమజ్జనం చేసేవారు. ఆలయ ప్రాంగణంలో పుస్తకాలలు నిల్వలు పేరుకుపోయాయి. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని భద్రపరిచేందుకు స్థలం అందుబాటులో లేదు. దీంతో ఇక నుంచి ప్రతీ బుధవారం రామకోటి పుస్తకాల నిమజ్జనం చేస్తామని ఈఓ దామోదర్‌రావు తెలిపారు.

వయోవృద్ధుల

సంక్షేమానికి సమష్టి కృషి

అదనపు కలెక్టర్‌ విద్యాచందన

చుంచుపల్లి: వయోవృద్ధుల సంక్షేమం, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వంతోపాటు సమాజం కూడా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని డీఆర్డీఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.విద్యాచందన అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో సెర్ప్‌, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వృద్ధుల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక, సామాజిక అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అనంతరం పలువురు వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, డీపీఓ అనూష పాల్గొన్నారు.

12న జాతీయ

అప్రెంటీస్‌ మేళా

చుంచుపల్లి: ఐటీఐ ఉత్తీర్ణుల కోసం ఈ నెల 12న కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ జి. రమేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే మేళాలో వివిధ పరిశ్రమల్లో అప్రెంటీస్‌ శిక్షణకు అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని ఆధార్‌ జిరాక్స్‌, బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలు, పరిశ్రమల యాజమాన్యాలు ఖాళీల వివరాలతో మేళాకు రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement