అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ హెచ్చరించారు. బుధవారం అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన ఇన్‌పేషెంట్ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐటీడీఏ నిధులు రూ.5లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, డెంటల్ చైర్లు సమకూర్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ మూడు నెలలుగా ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలపై బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని చెప్పారు. అనంతరం తహసీల్‌లో నియోజకవర్గంలోని తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి అప్పగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జారె, ఐటీడీఏ పీఓ రాహుల్


