ఆర్టీసీలో సమర సన్నాహాలు! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమర సన్నాహాలు!

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

రేపు ‘గుర్తింపు’ పోలింగ్‌..

17న తుది ఫలితాలు

పదేళ్ల తర్వాత ఎన్నికలతో హడావుడి

రెండు కూటముల మధ్య పోటాపోటీ

ఖమ్మం రీజియన్‌లో 1,791 మంది ఓటర్లు

చుంచుపల్లి: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 9న శుక్రవారం పోలింగ్‌ జరగనుండడంతో కార్మిక సంఘాల నేతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డిపోలు, కార్యాలయాల పరిధిలో కార్మికులను కలిసి తమ సంఘం మేనిఫెస్టోతో పాటు సాధించనున్న డిమాండ్లను వివరిస్తున్నారు.

బరిలో కూటములు

ఎన్నికల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో 11 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. రీజియన్‌స్థాయిలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ – టీడబ్ల్యూయూ మధ్య పొత్తుతో ఒక కూటమి ఏర్పడగా, టీఎంయూ నేత అశ్వథామరెడ్డితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌టీయూసీ మద్దతు తెలిపింది. మరోపక్క ఎంప్లాయీస్‌ యూనియన్‌ – నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్ల మధ్య పొత్తు కుదిరింది. ఎన్నికలు శుక్రవారం జరగనుండడంతో కార్మిక సంఘాల నేతలు ప్రచారంలో జోరు పెంచి డిపోల వద్దే కాక కార్మికుల నివాస ప్రాంతాలకు వెళ్లి కలుస్తున్నారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, బదిలీలు, పదోన్నతులతో పాటు పని ఒత్తిడి తగ్గింపు కోసం అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రతీ ఓటు కీలకంగా మారడంతో గ్రూపులు, వ్యక్తిగత పరిచయాల ఆధారంగా ప్రచారం సాగుతోంది.

రెండు ఓట్లు.. రెండు స్థాయిల్లో

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రతీ కార్మికుడు రాష్ట్రస్థాయిలో ఒక ఓటు, రీజియన్‌ స్థాయికి మరో ఓటు వేయాల్సి ఉంటుంది. ఈనెల 9న ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌, రీజియన్‌ స్థాయికి లేత ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగిస్తారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించినా ఫలితం మాత్రం వెల్లడించరు. ఆ రోజు విధుల్లో ఉండే కార్మికులకు 14, 15వ తేదీల్లో బ్యాలెట్‌ పద్ధతిలో ఓటు వేసే అవకాశం కల్పించి వీరి ఓట్లు కూడా లెక్కించాక 17న తుది ఫలితం ప్రకటిస్తారు. మొత్తంగా 51 శాతం ఓట్లు పొందిన సంఘానికి గుర్తింపు హోదా కల్పిస్తారు.

పదేళ్ల తర్వాత.. మళ్లీ ఎన్నికల వేడి..

2016 జూలైలో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) రాష్ట్రంలోని 11 రీజియన్లలో 10 చోట్ల విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. ఆ సంఘం పదవీకాలం 2018 ఆగస్టుతో ముగిసినా మళ్లీ ఎన్నికలు జరగలేదు. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడం, కొత్త కార్మిక సంఘాల ఆవిర్భావం, సంఘాల మధ్య పొత్తులతో పోటీ నెలకొంది. పదేళ్ల విరామం తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పెండింగ్‌ వేతన సవరణ, బకాయిలు, సిబ్బంది కొరత, పని ఒత్తిడి తదితర అంశాలు కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement