సూపర్‌బజార్(కొత్తగూడెం): వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ రోహిత్ రాజు తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ, సీపీఓ కార్యాలయం నుంచి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఎస్పీ రోహిత్ రాజు, సీపీఓ సునీతలను ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. 2015లో నిర్వహించిన గోదావరి పుష్కరాలకు సంబంధించిన వివరాలను సేకరించి సమగ్ర నివేదికతోపాటు సుమారు 30 పేజీల ప్రత్యేక బుక్‌లెట్ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ రోహిత్ మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఆర్‌ఓ పద్మావతి, డీపీఓ అనూష, డీటీఓ భూషిత్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహారం అందించాలి
ములకలపల్లి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విధిగా అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండల పరిధిలోని మూకమామిడి ఏకలవ్య పాఠశాలను బుధవారం సందర్శించారు. వంటగది, స్టోర్‌రూంలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పరీక్షలు జరుగుతుండగా నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. తహసీల్దార్ స్వాతిబిందు, ఎంఈఓ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అంకిత్


