మార్చిలో వినతి
రైల్వేబోర్డు పరిశీలిస్తోందన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్
భద్రాచలంరోడ్ డివిజన్ విషయంలో మరో అడుగు
డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి
అశ్వినీవైష్ణవ్‌కు వినతిపత్రం ఇస్తున్న
ఎంపీ రవిచంద్ర, పక్కన సురేశ్‌రెడ్డి (ఫైల్)
భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) రైల్వేస్టేషన్
కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ డివిజన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలపై రైల్వేబోర్డు దృష్టి పెట్టింది. తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ప్రకటనతో ఈ అంశం మరుగున
పడలేదని తేలిపోయింది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం
మార్పులు.. చేర్పులు
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో దక్షిణ మధ్య రైల్వే జోన్ విస్తరించి ఉంది. సికింద్రాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ జోన్ పరిధిలో 6,424 కి.మీ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ జోన్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో, మిగిలిన డివిజన్లతో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ 2026 జూన్ 1న ఏర్పాటు కానుంది. అయితే, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న డివిజన్ల సరిహద్దుల్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి.
సికింద్రాబాద్ మరింత పెద్దగా
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అతి పెద్దదైన సికింద్రాబాద్ జోన్ పరిధిలో 1,556 కి.మీ ట్రాక్ విస్తరించి ఉంది. తాజా విభజనలో ఇందులో మధిర నుంచి కొండపల్లి వరకు ఉన్న 46 కి.మీ. ట్రాక్ విశాఖ పట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణా కోస్తాలోకి వెళ్తోంది. ఇదే సమయంలో గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని కొన్ని సెక్షన్లు హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోకి వస్తున్నాయి. అంతేకాక విష్ణుపురం – పగిడిపల్లి సెక్షన్‌లో ఉన్న 142 కి.మీ.లు సికింద్రాబాద్ జోన్‌లోకి వస్తోంది. దీంతో ఈ జోన్ పరిధి 1,556 కి.మీ నుంచి ఏకంగా 1,652 కి.మీలకు పెరగనుంది. మరోవైపు గుంతకల్లు డివిజన్‌లోని వాడి – రాయచూరు సెక్షన్‌లో ఉన్న 102 కి.మీ.లు హైదరాబాద్ డివిజన్‌లోకి వస్తున్నాయి. దీనికి తోడు పెద్దపల్లి – కరీంనర్ – నిజామాబాద్ సెక్షన్‌లోని 160 కి.మీ కూడా సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు బదలాయిస్తున్నారు. ఈ మార్పులతో ఓ వైపు సికింద్రాబాద్ డివిజన్ పరిధి పెరుగుతుండగా.. ప్రతిపాదిత కాజీపేట డివిజన్ ఏర్పాటుకు అవకాశాలు క్లిష్టంగా మారాయి.
భద్రాచలంరోడ్ సానుకూల అంశాలు
ప్రస్తుతం మంజూరైన మణుగూరు – రామగుం డం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, భద్రాచలం – మల్కన్‌గిరి, కొత్తగూడెం – కిరండోల్ లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు డోర్నకల్ – విజయవాడకు ప్రత్యామ్నాయంగా కొత్తగూడెం – కొండపల్లి (పెనుబల్లి – కొండపల్లి) మార్గానికి ఇప్పటికే సర్వే కూడా జరిగింది. ఈ లైన్లలో ఏ ఒక్కటి అందుబాటులోకి వచ్చినా దానికి కేంద్ర స్థానం కొత్తగూడెమే అవుతుంది. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే 740 కి.మీ కొత్త రైల్వేలైన్ అందుబాటులోకి వస్తుంది. మరోవైపు భద్రాచలంరోడ్ రైల్వేస్టేషన్ ఛత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశాలతో దగ్గరి సరిహద్దులో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ కూడా అవుతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే డివిజన్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ సానుకూల అంశాలకు తోడు రాష్ట్ర ఎంపీల ఒత్తిడి కూడా తోడైతే డివిజన్ ఏర్పాటు కల సాకారం అయ్యేందుకు ఆస్కారం ఉంది.
దక్షిణ మధ్య రైల్వేను విభజించి గుంతకల్, గుంటూరు, విజయవాడ జోన్లతో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటవుతోంది. జోన్ల విభజనతో మొదలవడంతో కొత్త డివిజన్ల అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఉన్న కాజీపేట డివిజన్ డిమాండ్‌కు తోడుగా భద్రాచలంరోడ్‌ను కూడా పరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మార్చి 18న రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత ఇదే అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారు. దీంతో కొత్తగూడెం కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు పరిశీలన చేస్తోందని తెలుపుతూ మంత్రి అశ్వినీవైష్ణవ్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. దీంతో భద్రాచలంరోడ్ డివిజన్ అంశం ప్రతిపాదనల దశ నుంచి పరిశీలన దశలోకి వెళ్లినట్టయింది.
కొత్తగూడెం డివిజన్ కోసం విన్నపాలు


