కల్యాణం... కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం... కమనీయం

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు. అలాగే, స్వామికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మానికి చెందిన భక్తులు బుధవారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బుడిగం వీరయ్య – రేణుక దంపతులు అన్నదానం నిమిత్తం రూ.లక్షను ఆలయ అధికారులకు అందజేయగా, వారు రశీదు అందజేసి స్వామి దర్శనం చేయించారు.

బీటీపీఎస్‌ కాలుష్యంపై ఆరా

గ్రామస్తుల ఫిర్యాదుతో

పీసీబీ అధికారుల పరిశీలన

పినపాక: పినపాక – మణుగూరు మండలాల సరిహద్దులోని బీటీపీఎస్‌ నుంచి వెలువడుతున్న కాలుష్యం, బూడిదతో ఇబ్బంది పడుతున్నామని బయ్యారం గ్రామానికి చెందిన పలువురు ఇటీవల హైదరాబాద్‌లో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో బుధవారం గ్రామానికి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. బయ్యారం గ్రామంలోని పలు ఇళ్లపై ప్రత్యేక పరికరాల ద్వారా గాలిలో బూడిక కణాలు, కాలుష్య స్థాయిని నమోదు చేశారు. బీటీపీఎస్‌ నుంచి వస్తున్న బూడిద ఇళ్లపై పేరుకుపోవడమే కాక గాలిలో కలుస్తుండడంతో శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యాన పరిశీలన అనంతరం సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మైనార్టీలకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థుల కోసం తెలంగాణ మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి సంజీవరావు తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడమేకాక మహిళా అభ్యర్థులకు 33.33 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా https:// cet. cgg. gov. in/ tmreis వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం జూన్‌ 14న నిర్వహించే ప్రవేశపరీక్షలో ప్రతిభ చాటిన 100 మందిని ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు కలిగి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని చెప్పారు. ఈమేరకు ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్సీ మతాలకు చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు పనిదినాల్లో 040–23236112 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.

అటవీ రక్షణే మా ప్రాధాన్యత

కలవలనాగారం భూములపై

రేంజర్‌ తేజస్వి

కరకగూడెం: అటవీ సంపదను పరిరక్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఏడూళ్ల బయ్యారం రేంజర్‌ తేజస్వి తెలిపారు. ఏళ్ల తరబడి వివాదాల్లో ఉన్న కరకగూడెం మండలం కలవలనాగారంలో 600 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యాన ఆమె స్పందించారు. ఆ భూమి రక్షిత అటవీ ప్రాంతమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయగా.. ప్రభుత్వం వద్ద ఉన్న నిజాం నాటి నోటిఫికేషన్‌ పత్రాలే అసలైనవని తేలిందన్నారు. అంతేకాక ఫోర్జరీ లేదా రెవెన్యూ రికార్డులతో అటవీ భూములను సొంతం చేసుకోవాలని యత్నించినా అది సాధ్యం కాదని తేలిపోయిందని చెప్పారు. ప్రస్తుతం 600 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనే ఉందని ఆమె వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement