నిధులొస్తేనే ఊరట
కుంటుపడిన అభివృద్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న
నూతన పాలకవర్గాలు
జిల్లాలో 471 గ్రామ పంచాయతీలకు ప్రయోజనం
చిన్నవైతే రూ.5 లక్షలు,
పెద్దవైతే రూ. 10 లక్షలు..
చుంచుపల్లి: చాలాకాలంగా గ్రామపంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు కూడా నిధుల లేమిపై ఒకింత ఆందోళనతోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఊరట కలిగించినట్లయింది. మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున 2026 ఆరంభంలోనే ఎస్‌డీఎఫ్ నిధులిస్తామని కొండగల్ బహిరంగ సభలో సీఎం ప్రకటించారు. ఈ చొప్పున జిల్లాలో 471 గ్రామపంచాయతీలకు సుమారు రూ.26 కోట్ల మేర నిధులు అందనున్నాయి.
చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయం
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నెలకు రూ.10.32 కోట్ల చొప్పున విడుదలవుతుంటాయి. వీటిని గ్రామ జనాభా ఆధారంగా పంచాయతీలకు పంచుతారు. ఇవి గ్రామాలకు ఎటూ సరిపోవడం లేదు. చిన్న పంచాయతీలకు రూ. 60 వేల నుంచి రూ.లక్షలోపే ఆర్థిక సంఘం నిధులు అందుతుండంతో ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ ఖర్చులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులకే సరిపోతున్నాయి. ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు నిధులు ఉండటంలేదు. దీంతో ఐదారేళ్లుగా చిన్న పంచాయతీల్లో పాలన మరింతగా కుంటుపడుతోంది. పెద్ద పంచాయతీలకు ఇంటి పన్నులతోపాటు ఇతర ఆర్థిక వనరులు ఉండటంతో కొంత వెసులుబాటు ఉంటోంది. కాగా సీఎం నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం, తాగునీటి వనరుల ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించుకునే వీలు కలుగుతుందని నూతన పాలకవర్గాలు భావిస్తున్నాయి.
పంచాయతీల గత పాలకవర్గాల గడువు 2024 జనవరితో ముగియగా, ఆ తర్వాత 22 నెలలపాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. పాలకవర్గం లేకపోవడం, ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంవతో అభివృద్ధి కుంటుపడింది. రోజూవారీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చులను కూడా పంచాయతీ కార్యదర్శులే భరించాల్చి వచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికల జరగ్గా, ఈ నెల 22న కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి తీపి కబురు చెప్పడంతో కొత్త సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 471 గ్రామపంచాయతీలు ఉండగా, 8,67,927 మంది గ్రామీణ జనాభా ఉంది. వెయ్యిలోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు 166 కాగా, 1000 నుంచి 4 వేలలోఫు జనాభా ఉన్న పంచాయతీలు 282 వరకు ఉన్నాయి. 4 వేల నుంచి 10 వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలు 18 వరకు ఉన్నాయి. ఇక 10 వేలకుపైగా జనాభా కలిగిన భద్రాచలం, సారపాక, అశ్వాపురం, సమితి సింగారం, కూనవరం 5 మేజర్ పంచాయతీలు ఉన్నాయి.
ఎస్‌డీఎఫ్ నుంచి విడుదల చేస్తామని సీఎం ప్రకటన


