పాలకమండలికి పచ్చ జెండా!
గత డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైనా పూర్తికాని ప్రక్రియ త్వరలో మరోసారి జారీ చేయనున్న దేవాదాయ శాఖ నాడు 50 మందికి పైగా దరఖాస్తుల సమర్పణ
భద్రాచలం : ఒకడుగు ముందుకు.. పదడుగులు వెనక్కు అన్న చందంగా ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కసారి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాలేదు. అయితే ఆలయ అభివృద్ధి హామీతో ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆశావహులు దరఖాస్తు చేసుకుని.. పైరవీలు, లాబీయింగ్‌తో హడావిడి చేసినా పాలక మండలిని మాత్రం నియమించలేదు. బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏడాదిలో రెండుసార్లు నోటిఫికేషన్..?
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 నవంబర్ 26 నుంచి 2012 నవంబర్ 25 చివరి(13వ) ట్రస్ట్‌బోర్డు పనిచేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పాలకమండలిపై దృష్టి పెట్టనే లేదు. ఇక ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని ఇతర ఆలయాలతో పాటు భద్రాద్రి దేవస్థానానికి కూడా పాలకమండలి ఏర్పాటుకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయగా 50 మందికి పైగానే ఆశావహులు దరఖాస్తులు సమర్పించారు. అనంతర కాలంలో పాల్వంచలోని పెద్దమ్మతల్లి గుడికి పాలకమండలి కొలువుదీరినా రామాలయం విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. మళ్లీ మూడు రోజుల క్రితం రెండోసారి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేవాదాయ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులకు జాబితా అందించనున్నారు. దీంతో ఏడాది కాలంలో రెండో మారు నోటిఫికేషన్ జారీ కానుంది.
కీలక సమయంలో..
భద్రాద్రి రామాలయంలో డిసెంబర్‌లో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు, ఆ తర్వాత శ్రీరామనవమి, 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటైతే అధికారులకు సాయంగా ఉంటుందని పలువురు అంటున్నారు. గతేడాది ముక్కోటి నాటికే కొలువు తీరుతుందనుకున్న పాలక మండలి.. ఈసారైనా ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా ఉత్సవాల సమయంలో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను సర్కారు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మండలి ఏర్పాటుతో నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రామాలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషంగా ఉంది. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి పాలకమండలిని ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. దేవస్థానంలో త్వరలో ముఖ్య ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు ఎంతో కీలకం.
– మానె రామకృష్ణ, బీఆర్‌ఎస్ నాయకుడు
రామాలయ ట్రస్ట్ బోర్డ్‌కు మళ్లీ గ్రీన్ సిగ్నల్
పాలకమండలికి పచ్చ జెండా!


