ఆడపిల్లల చదువుతోనే కుటుంబం అభివృద్ధి
● కలెక్టర్ జితేష్ వి పాటిల్ ● కేజీవీబీలో తనిఖీ.. బాలికలతో కలిసి భోజనం
జూలూరుపాడు: ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, బాలికలు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జూలూరుపాడు కేజీబీవీని సోమవారం ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటశాల, డైనింగ్ హాల్, డార్మెటరీ, వాష్‌రూమ్, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. పాఠశాల ప్రాంగణాన్ని ఆటస్థలంగా అభివృద్ధి చేయాలని, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎస్‌ఓను ఆదేశించారు. అవసరమైన క్రీడా సామగ్రి సమకూరుస్తామని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని సూచించారు. వీధిలైట్లు లేక ఇబ్బంది పడుతున్నామని ఏఓ చెప్పగా.. సోలార్ లైట్లు ఏర్పాటు చేయిస్తామని, తక్షణమే అంచనా ప్రతిపాదనలు పంపించాలని ఎంపీడీఓకు సూచించారు. మధ్యాహ్న భోజనం కోసం బాలికలతో కలిసి క్యూలైన్‌లో నిల్చుని ముచ్చటించిన కలెక్టర్.. వారితో కలిసి భోజనం చేశారు. అందరూ కనీసం డిగ్రీ వరకు చదువుకుని జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి ఆలోచన చేయాలన్నారు. ప్రణాళికాయుతంగా చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించాలని సూచించారు. వంటలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ పూరేటి అజయ్, ఎంపీఓ తులసీరామ్, సూపరింటెండెంట్ తాళ్లూరి రవి, కేజీబీవీ ఎస్‌ఓ పద్మజ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం తగదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, హాజరైన కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, డీఆర్‌డీఓ విద్యాచందన, వ్యవసాయాధికారి బాబూరావు, సహకార శాఖాధికారి శ్రీనివాసరావు, పౌరసరఫరాల డీఎం త్రినాథ్‌బాబు, డీఎంఓ నరేందర్ పాల్గొన్నారు.


