బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌ఓ
చుంచుపల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా తుకారాం రాథోడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, తుకారామ్ రాథోడ్‌ను ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ చైతన్య, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ తేజశ్రీ, పుల్లారెడ్డి, శృతి, డీడీఎంహెచ్‌ఓ నాగలక్ష్మి, డీపీఎంఓ మోహన్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
పామాయిల్ గెలల
క్రషింగ్ నిలిపివేత
అశ్వారావుపేటరూరల్ : అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో వార్షిక నిర్వహణ కోసం గెలల క్రషింగ్ నిలిపివేసినట్లు ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, స్థానిక ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం గెలల దిగుమతి తక్కువగా వస్తున్నందున వార్షిక నిర్వహణకు యాజమాన్యం నిర్ణయించిందని, రైతులు సహకరించాలని కోరారు. స్థానిక ఫ్యాక్టరీలో రెండు టన్నులలోపు గెలలు మాత్రమే దిగుమతి చేసుకుంటారని, అధిక టన్నులు వస్తే దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించాలని సూచించారు. తిరిగి క్రషింగ్‌ను ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
‘అమ్మకు అక్షరమాల’ ప్రారంభం
చుంచుపల్లి: జిల్లాలోని అన్ని మండలాల్లో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ విద్యాచందన తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామంలో డీఈఓ నాగలక్ష్మితో కలిసి సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలంతా చదువుకోవాలని, తెలుగు చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయగలిగితే అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. డీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో 38 వేల మంది నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించామని, ప్రతీ పది మందికి ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు అనుకూలమైన సమయంలో విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కో– ఆర్డినేటర్ ఎస్‌కే సైదులు, ఎంపీడీఓ అంకుబాబు, ఎంఈఓ కృష్ణయ్య, ఉల్లాస్ కో–ఆర్డినేటర్ హీరాలాల్ పాల్గొన్నారు.
ఉర్సు ఉత్సవాలకు వేళాయె..
పోస్టర్లు ఆవిష్కరించిన నిర్వాహకులు
ఇల్లెందురూరల్ : మండలంలోని సత్యనారాయణపురం శివారు అటవీ ప్రాంతంలో గల హజరత్ నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్‌లో ఉర్సే షరీఫ్ ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 19, 20 తేదీల్లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు సోమవారం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఉర్సు ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు దర్గాహ్ ముస్తాబవుతోంది. ప్రతీ ఏటా పట్టణంలోని హజరత్ ఖాసీం దుల్హా దర్గాహ్ షరీఫ్‌లో కార్తీక పౌర్ణమి రోజున ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్‌లో అమావాస్య వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ క్రమంలో హజరత్ ఖాసీం దుల్హా దర్గా షరీఫ్ నుంచి ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు ఊరేగింపుగా సందల్‌ను నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గాకు చేరుస్తారు. 20న ఉదయం 8 గంటలకు హజరత్ ఖాసీం దుల్హా దర్గాహ్ షరీఫ్ నుంచి ప్రారంభమయ్యే భారీ ప్రదర్శన నాగుల్‌మీరా మౌలాచాన్ దర్గాహ్ షరీఫ్ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు దావతే హజరత్, సాయంత్రం 6 గంటలకు సలామీ, 7 గంటలకు ఖవ్వాలి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌ఓ
బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌ఓ


