పశువులకు ‘గాలికుంటు’ టీకాలు వేయించండి
జూలూరుపాడు: తెల్ల, నల్ల పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. పాపకొల్లులో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఈనెల 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. నాలుగు నెలల వయసు పైబడిన దూడల నుంచి టీకాలు వేయించవచ్చని చెప్పారు. నిండు సూడు గేదెలు, ఆవులకు టీకాలు వేయొద్దని సూచించారు. కార్యక్రమంలో కాకర్ల, జూలూరుపాడు పశు వైద్యాధికారులు బానోత్ బద్దూలాల్, సాయిరాం సందీప్ తదితరులు పాల్గొన్నారు.


